యాచకులకు దానం చేయొద్దు.. వారిపై ఇన్వెస్ట్ చేయండంటున్న సంస్థ

  • బెగ్గర్స్ కార్పొరేషన్ అనే సంస్థ వినూత్న కార్యక్రమం
  • రూ.10 నుంచి రూ.10,000 వరకు తోచినంత పెట్టుబడి పెట్టొచ్చు
  • పెట్టుబడిపై 16.5 శాతం వార్షిక రాబడి చెల్లింపు
  • ఆ పెట్టుబడి ఓ యాచకుడి జీవితంలో మార్పునకు శ్రీకారం
ఇల్లు దాటి బయటకు వస్తే ప్రతీ ప్రాంతంలోనూ మనకు యాచకులు దర్శనమిస్తుంటారు. వయసులో ఉండి, పని చేసుకునే సత్తా ఉన్న వారు కూడా ఇదే మార్గాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. అందరూ కాకపోయినా కొంత మంది పాపం అనుకుంటూ తమకు తోచినంత దానం చేస్తుంటారు. కానీ, ఇక మీదట ముష్టి వేయకండంటూ పిలుపునిస్తోంది ‘బెగ్గర్స్ కార్పొరేషన్’. ‘దానం చేయకండి. ఇన్వెస్ట్ చేయండి’ అనేది ఈ సంస్థ నినాదం.

ఒడిశాకు చెందిన చంద్ర మిశ్రా అనే వ్యక్తి బెగ్గర్స్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. యాచకుల కోసం వచ్చే పెట్టుబడులను స్వీకరించి.. యాచకుల జీవితాలను మార్చడం బెగ్గర్స్ కార్పొరేషన్ ఎంపిక చేసుకున్న మార్గం. ఆరంభంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఆయన అసలు మొత్తాన్ని తిరిగి ఇవ్వడంతోపాటు 16.5 శాతం వార్షిక వడ్డీని కూడా చెల్లించారు. 14 యాచక కుటుంబాల స్థితిగతులను మెరుగుపరిచారు.

గుజరాత్ లో ఓ ఆలయం ముందు కొందరు కూర్చుని యాచించుకోవడాన్ని చూసినప్పుడు, వారి జీవితాల్లో మార్పులు తీసుకురావాలన్న ఆలోచన చంద్ర మిశ్రాలో కలిగింది. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలనే ఆలోచనకు వచ్చారు. పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఆయన 2020 డిసెంబర్ 31న వారణాసికి చేరుకున్నారు. యాచకులకు ఉపాధి కల్పించాలనే ఆలోచనను స్థానిక ఎన్జీవో అయిన జన్మిత్ర న్యాస్ తో పంచుకున్నారు. మిశ్రా సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్న సదరు ఎన్జీవో ఆయనతో కలసి పనిచేసేందుకు ముందుకు వచ్చింది. 

2021లో రెండోసారి కోవిడ్ లాక్ డౌన్ సమయంలో వారణాసిలో తమకు సాయం చేయాలంటూ ఎంతో మంది యాచకులు చంద్ర మిశ్రాను సంప్రదించారు. అదే ఏడాది ఆగస్ట్ లో బెగ్గర్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. భర్తతో ఇంటి నుంచి గెంటివేతకు గురైన ఓ మహిళకు తొలిసారిగా బ్యాగులు కుట్టే పని నేర్పించి ఉపాధి కల్పించారు. అలా యాచకులకు శిక్షణ ఇప్పించి వారు తయారు చేసే ఉత్పత్తులను ఆయన మార్కెటింగ్ చేయడం మొదలు పెట్టారు. ఇది తెలిసి మరింత మంది యాచక వృత్తిని వీడి చంద్ర మిశ్రా బెగ్గర్స్ కార్పొరేషన్ లో చేరడం మొదలు పెట్టారు. ఇప్పుడు 12 కుటుంబాలు బ్యాగులు తయారు చేస్తుంటే, రెండు కుటుంబాలు పూలను విక్రయించే పనిలో ఉన్నాయి. 

‘‘రూ.10 నుంచి రూ.10,000 వరకు మీకు తోచినంత ఇన్వెస్ట్ చేయండి. ఆరు నెలల్లో 16.5 శాతం వడ్డీతో చెల్లిస్తాం. అది యాచకుల జీవితాల్లో మార్పులు తెస్తుంది’’ అని మిశ్రా చెబుతున్నారు. ‘‘ఒక్కో యాచకుడికి సంబంధించి రూ.1.5 లక్షల పెట్టుబడి అవసరం అవుతుంది. అందులో రూ.50వేలతో నైపుణ్యాలపై శిక్షణకు వెచ్చిస్తాం. మరో రూ.లక్షను వారి వ్యాపారం ఏర్పాటుకు వినియోగిస్తాం’’ అని చెబుతున్నారు. ఓ రూ.5, రూ.10 రూపాయలు ముష్టి వేసి వెళ్లే వారితో పోలిస్తే.. యాచకుల జీవితాల్లో మార్పునకు పాటుపడుతున్న చంద్ర మిశ్రా మనసారా అభినందనీయులు. ‘ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు..’ అన్న పాటకు సార్థకత చూపిస్తున్నారు. 


More Telugu News