ఏసీ బోగీల్లో నీళ్లు బంద్.. చైన్‌లాగి నిరసన తెలిపిన రైల్వే ప్రయాణికులు

  • విశాఖ ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీల్లో నీళ్లు బంద్
  • సికింద్రాబాద్‌లోనే ఫిర్యాదు చేసిన ప్రయాణికులు
  • విశాఖపట్నం చేరుకున్నా లభించని పరిష్కారం
  • చైన్ లాగి రైల్ ప్రయాణికుల నిరసన
  • సిబ్బంది ప్రయాణికులకు సర్ది చెప్పడంతో ముందుకు కదిలిన రైలు
సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్‌కు వెళుతున్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ ఏసీ బోగీల్లో నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు చివరకు నిరసనకు దిగారు. విశాఖపట్నం స్టేషన్‌ నుంచి రైలు ముందుకు కదలకుండా చైన్ లాగి మరీ ఆందోళన చేపట్టారు. దీంతో.. వైజాగ్‌ స్టేషన్‌లో కొంత సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

సికింద్రాబాద్‌లో రైలు బయలుదేరినప్పటి నుంచే నీళ్లు లేక అవస్థలు పడ్డామని ప్రయాణికులు వాపోయారు. ఈ విషయమై ఫిర్యాదు చేయగా విజయవాడలో నీరు నింపుతామని చెప్పి పంపించేశామన్నారు. విజయవాడ చేరుకున్నాక నీళ్ల విషయాన్ని ప్రస్తావిస్తే విశాఖలో నింపుతామని చెప్పారని ఆరోపించారు. 

అయితే.. విశాఖపట్నంలోనూ బోగీల్లో నీళ్లు నింపకపోవడంతతో ఆగ్రహించిన ప్రయాణికులు రైలు కదలనీకుండా చేసి నిరసన తెలిపారు. దీంతో 15 నిమిషాల పాటు రైలు స్టేషన్‌లోనే ఆగిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలువురు ఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది ప్రయాణికులకు సర్దిచెప్పి పంపించారు. కాగా.. రైల్వే ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మెకు దిగడంతో విశాఖలో నీళ్లు నింపడం సాధ్యపడలేదని సమాచారం. గత్యంతరం లేక సిబ్బంది ఆందోళనల నడుమ రైలు ముందుకు కదిలింది.


More Telugu News