బెట్టింగ్ నిర్వహించే ఆన్ లైన్ గేమ్స్ పై కేంద్రం నిషేధం

  • ఆన్ లైన్ గేమింగ్స్ పై కొత్త రూల్స్ తీసుకొచ్చిన కేంద్ర ఐటీ శాఖ
  • బెట్టింగ్, జూదం లేని గేమ్స్ కే అనుమతి
  • ఆన్ లైన్ గేమర్స్ కు కేవైసీ తప్పనిసరి
స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత ఆన్ లైన్ గేమింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది దీనికి అలవాటు పడ్డారు. చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో భారత్ లో ఆన్ లైన్ గేమింగ్ కోసం కేంద్రం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిబంధనలు ప్రకటించింది. బెట్టింగ్, జూదం నిర్వహించే ఆన్ లైన్ గేమ్స్ ను నిషేధిస్తామని ఆ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ విషయం నిర్థారించేందుకు కేంద్రం కొన్ని సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్స్ (ఎస్ఆర్ఓ) నియమిస్తుందన్నారు. ఇందులో వ్యాపార ప్రతినిధులు, విద్యావేత్తలు, సైకాలజీ నిపుణులు సహా ఇతర నిపుణులు ఉంటారని ప్రభుత్వం తెలిపింది.  

ఆయా గేమ్స్ బెట్టింగ్, జూదం ఆఫర్ చేస్తున్నాయా? లేదా? అనేది తేల్చిన తర్వాత వాటికి అనుమతి ఇవ్వడానికి ఈ ఎస్ఆర్ఓలు బాధ్యత వహిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. బెట్టింగ్ కు అవకాశం లేదని ఎస్ఆర్ఓ భావిస్తే అలాంటి రియల్ మనీ గేమ్ కు అనుమతి ఇవ్వొచ్చని నిబంధనల్లో పేర్కొన్నారు. అలాగే, ఆన్ లైన్ గేమర్లు కూడా కేవైసీ వెరిఫికేషన్ తప్పనిసరని ఐటీ శాఖ స్పష్టం చేసింది. కొత్త నిబంధనలను పాటించని ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలపై చర్యలు ఉంటాయని తేల్చి చెప్పింది. అనుమతి పొందిన ఎస్ఆర్ఓల వద్ద తమ గేమ్ రిజిస్టర్ చేసుకుని, వాటి అనుమతిని గేమింగ్ కంపెనీలు పొందడం తప్పనిసరని పేర్కొంది.


More Telugu News