దుబాయ్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భారతీయుడికి రూ.11 కోట్ల పరిహారం

  • 2019లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భారతీయ విద్యార్థి
  • 1 మిలియన్ దిర్హామ్ పరిహారం చెల్లించేందుకు ముందుకొచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీ
  • ప్రమాద తీవ్రత దృష్ట్యా ఈ మొత్తం సరిపోదంటూ కోర్టును ఆశ్రయించిన బాధిత కుటుంబం
  • 5 మిలియన్ దిర్హామ్‌ల పరిహారం చెల్లించాలంటూ కోర్టు ఆదేశం
దుబాయ్‌లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ భారతీయుడికి రూ.11 కోట్లు పరిహారం కింద చెల్లించాలంటూ యూఏఈ సుప్రీంకోర్టు అక్కడి ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది. ఇన్సూరెన్స్ కంపెనీ గతంలో చెల్లిస్తానన్న మొత్తం సరిపోదంటూ బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. 

2019లో దుబాయ్‌లో జరిగిన ఓ ప్రమాదంలో భారత విద్యార్థి మహ్మద్ బేగ్ తీవ్రంగా గాయపడ్డాడు. సెలవుల్లో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగివస్తున్న సమయంలో అతడు ప్రయాణిస్తున్న బస్సు ఓవర్ హెడ్ హైట్ బారియర్‌ను ఢీకొట్టడంతో బస్సు ఎడమవైపు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో మరణించిన 17 మందిలో 12 మంది భారతీయులే. 

ఈ ఘటనలో బేగ్ కూడా తీవ్రగాయాల పాలయ్యాడు. అతడి మెదడులో సగ భాగం దెబ్బతింది. చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇక ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌కు కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు 3.4 మిలియన్ దిర్హామ్సల పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించింది. 

మరోవైపు.. బేగ్‌కు 1 మిలియన్ దిర్హామ్‌ల పరిహారం చెల్లించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీ ముందుకు రాగా బాధిత కుటుంబం తిరస్కరించింది. ప్రమాద తీవ్రత దృష్ట్యా ఈ మొత్తం సరిపోదంటూ బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే న్యాయస్థానం తాజాగా బేగ్‌కు 5 మిలియన్ దిర్హామ్‌ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

UAE

More Telugu News