బీజేపీలో చేరిన ఏకే ఆంటోనీ కుమారుడు.. బాధించిందన్న కాంగ్రెస్ సీనియర్ నేత

  • కేంద్రమంత్రుల సమక్షంలో నిన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్న అనిల్ ఆంటోనీ
  • కుమారుడిది తప్పుడు చర్యన్న ఏకే ఆంటోనీ
  • జీవిత చరమాంకంలో ఉన్న తాను తుదిశ్వాస వరకు కాంగ్రెస్‌తోనే ఉంటానని స్పష్టీకరణ
  • 2014 తర్వాత దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు మొదలయ్యాయన్న సీనియర్ నేత
తన కుమారుడు అనిల్ కె ఆంటోనీ బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ తీవ్రంగా స్పందించారు. అది తప్పుడు చర్యన్న ఆయన.. కుమారుడి నిర్ణయం తనను తీవ్రంగా బాధించిందన్నారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, వి.మురళీధరన్, బీజేపీ కేరళ చీఫ్ కె.సురేంద్రన్ సమక్షంలో అనిల్ ఆంటోనీ నిన్న కాషాయ కండువా కప్పుకున్నారు. 

కుమారుడు బీజేపీలో చేరడంపై తీవ్రంగా స్పందించిన ఆంటోనీ.. అనిల్ నిర్ణయం తనను నిజంగా చాలా బాధించిందన్నారు. అది పూర్తిగా తప్పుడు చర్యేనని చెప్పారు. కుమారుడిలా తాను పార్టీ మారబోనని చెప్పారు. తన వయసు ఇప్పుడు 82 సంవత్సరాలని, జీవిత చరమాంకంలో ఉన్నానని అన్నారు. చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు. 

బీజేపీపైనా ఏకే ఆంటోనీ విరుచుకుపడ్డారు. లౌకికవాదంపైనే దేశ ఐక్యత ఆధారపడి ఉందని, అయితే, 2014 నుంచి దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో నెమ్మదిగా మొదలైన ఈ ప్రక్రియ 2019 నుంచి వేగం పుంజుకుందన్నారు. కాగా, అనిల్ ఆంటోనీ ఈ ఏడాది జనవరిలోనే కాంగ్రెస్‌కు, పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు.


More Telugu News