జైలు నుంచి విడుదలైన బండి సంజయ్.. సీపీ రంగనాథ్ పై ఆగ్రహం

  • కేసు విషయంలో చెప్పిన మాటలన్నీ నిజమేనని పోలీస్ టోపీపై మూడు సింహాలపై ప్రమాణం చేయాలని సవాల్
  • తనకు సంబంధం లేదని ప్రమాణం చేస్తానన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
  • రేపటి మోదీ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపు
పదో తరగతి పరీక్ష లీకేజీ కేసులో అరెస్టయిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ పై ఈ ఉదయం కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ సీపీ రంగనాథ్ పై మండిపడ్డారు. ఈ కేసులో రంగనాథ్ చెప్పిన విషయాలు నిజమేనా? పోలీస్ టోపీపై ఉన్న మూడు సింహాలపై ఆయన ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. 

లీకేజీ విషయంలో తనకు సంబంధం లేదని తాను ప్రమాణం చేస్తానని చెప్పారు. పేపర్ లీక్ కి, మాల్ ప్రాక్టీస్ కి తేడా తెలియదా? అని సీపీని ప్రశ్నించారు. ఆయన సంగతి తమకు తెలుసని, ఆయన ఎక్కడెక్కడ ఏం చేశారో అంతా తెలుసన్నారు. పోలీస్ వ్యవస్థను అవమానించేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబంలోనే లీకు వీరులు, లిక్కర్ వీరులు ఉన్నారని ఆరోపించారు. 

ఎమ్మెల్సీ కవితతో పాటు మంత్రి కేటీఆర్ కూడా జైలుకెళ్లడం ఖాయమని బండి సంజయ్ అన్నారు. టీఎస్ పీఎస్సీ పశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జీతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. ‘పదో తరగతి హిందీ పేపర్ ఎవరైనా లీక్ చేస్తారా? మరి, హిందీ పేపర్ లీక్ చేసింది మేమైతే.. తెలుగు పేపర్ లీక్ చేసింది ఎవరు? అసలు పరీక్షా కేంద్రానికి మొబైల్ తీసుకెళ్లింది ఎవరు? ఫొటో తీసింది ఎవరు?’ అని సంజయ్ ప్రశ్నించారు. తమకు జైలు, లాఠీ దెబ్బలు కొత్త కాదన్నారు. రేపటి మోదీ సభతో బీజేపీ బలాన్ని నిరూపిద్దామని కార్యకర్తలకు సంజయ్ పిలుపునిచ్చారు.


More Telugu News