వాకపల్లి కేసులో 16 ఏళ్ల తర్వాత గిరిజన మహిళలకు ఊరటనిచ్చే తీర్పు!

  • కూంబింగ్ కోసం వచ్చి గిరిజన మహిళలపై పోలీసుల అత్యాచారం ఆరోపణలు
  • ఆధారాలు లేని కారణంగా నిందితులైన 13 మంది పోలీసులను నిర్దోషులుగా ప్రకటించిన వైనం
  • ఈ కేసులో విచారణ సరిగా జరగలేదన్న కోర్టు
  • కేసును ఉద్దేశపూర్వకంగా నీరు గార్చిన ఇద్దరు అధికారులను విచారించాలని అపెక్స్ కమిటీకి కోర్టు ఆదేశం
  • బాధిత మహిళలకు నష్ట పరిహారం చెల్లించాలన్న కోర్టు
వాకపల్లి గిరిజన మహిళలపై పోలీసుల అత్యాచారం కేసులో విశాఖపట్టణం పదకొండో అదనపు జిల్లా కోర్టు నిన్న కీలక తీర్పు వెలువరించింది. బాధిత మహిళలకు అన్యాయం జరిగిందని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ కేసులో విచారణ మాత్రం సరిగా జరగలేదని పేర్కొంది. దర్యాప్తు అధికారుల తీరు కారణంగా సరైన ఆధారాలు లభించకపోవడంతో నిందితులైన 13 మంది పోలీసులను విడిచిపెడుతున్నట్టు స్పష్టంగా పేర్కొంది. 

అంతేకాదు, కేసును ఉద్దేశపూర్వకంగా నీరు గార్చిన విచారణ అధికారులు బి.ఆనందరావు, ఎం.శివానందరెడ్డిని విచారించాలని ఏపీ అపెక్స్ కమిటీని కోర్టు ఆదేశించింది. జిల్లా న్యాయసేవా సంస్థ ద్వారా బాధిత మహిళలకు నష్టపరిహారం ఇప్పించాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. కోర్టు తీర్పుపై ప్రజా, మానవహక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వాకపల్లి మహిళల 16 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి విజయం లభించిందని మానవ హక్కుల వేదిక పేర్కొంది.

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. 20 ఆగస్టు 2007న కూంబింగ్ కోసం వచ్చిన స్పెషల్ పార్టీ పోలీసులు తమపై అత్యాచారం చేశారంటూ అప్పటి విశాఖపట్టణం జిల్లా జి.మాడుగుల మండలంలోని వాకపల్లికి చెందిన 11 మంది గిరిజన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచీ ఈ కేసు పలు మలుపులు తిరిగింది. 

బాధిత మహిళలు, ప్రజా, మానవహక్కుల సంఘాల పోరాటంతో 2018లో విశాఖలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో కోర్టు మొత్తం 36 మంది సాక్షులను విచారించింది. ఇక, బాధిత మహిళల్లో ఇద్దరు చనిపోయారు కూడా. ఇప్పుడీ కేసులో 16 ఏళ్ల తర్వాత కోర్టు బాధిత మహిళలకు అన్యాయం జరిగినట్టు గుర్తించింది. ఉద్దేశపూర్వకంగా కేసును నీరు గార్చిన అధికారులపై విచారణ జరపాలని ఆదేశించింది.


More Telugu News