కోల్‌కతా చేతిలో ఓడిన బెంగళూరుకు మరో దెబ్బ.. ఐపీఎల్ నుంచి రీస్ టాప్లీ ఔట్

  • ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన టాప్లీ
  • స్థానభ్రంశం చెందిన భుజం ఎముక
  • స్వదేశానికి పంపించామన్న హెడ్ కోచ్ సంజయ్ బంగర్
  • పదేపదే గాయాలబారినపడుతున్న ఇంగ్లండ్ బౌలర్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ బౌలర్ రీస్ టాప్లీ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా టాప్లీ గాయపడ్డాడు. దీంతో అతడి భుజం ఎముక స్థానభ్రంశం చెందింది. 29 ఏళ్ల టాప్లీ చీలమండ గాయం కారణంగా గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యాడు. 

గాయపడిన టాప్లీ స్వదేశం వెళ్లిపోయినట్టు బెంగళూరు జట్టు హెడ్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపాడు. టాప్లీని ఇక్కడే ఉంచేందుకు ప్రయత్నించామని అయితే, ఆట నుంచి అతడికి కొంతకాలంపాటు విశ్రాంతి ఇవ్వాలన్న నిపుణుల సలహాతో స్వదేశానికి పంపినట్టు పేర్కొన్నాడు. 

టాప్లీ గాయపడడం ఇదే తొలిసారి కాదు. పదేపదే గాయాల బారినపడుతున్న టాప్లీ భవితవ్యంపై సందేహాలు నెలకొన్నాయి. గత ఐదేళ్లలో నాలుగుసార్లు అతడి వెన్నుకి గాయాలయ్యాయి. 2015లో అరంగేట్రం చేసిన టాప్లీ 22 వన్డేల్లో 33 వికెట్లు తీసుకున్నాడు. టాప్లీ స్థానాన్ని ఎవరితో భర్తీ చేసేదీ త్వరలోనే ప్రకటిస్తామన్న బంగర్.. శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ 10న, ఆస్ట్రేలియన్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ 14న జట్టులో చేరుతారని వెల్లడించాడు. కాగా, గత రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు దారుణ ఓటమిని మూటగట్టుకుంది.


More Telugu News