ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ

  • ఒకేసారి 56 మందికి స్థాన చలనం
  • వీరిలో 8 జిల్లాల కలెక్టర్లు కూడా
  • నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ప్రధాన కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. 8 జిల్లాల కలెక్టర్లు సహా 56 మందికి స్థానచలనం కలిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం అర్ధ రాత్రి ఉత్తర్వులు (జీవో 635) జారీ చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారం జరుగుతుండగా.. ఒకేసారి ఇంత మంది అధికారులను బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే వేసవిలో సార్వత్రిక ఎన్నికలు జరగాలి. 

విజయనగరం కలెక్టర్‌ ఎ.సూర్యకుమారిని పంచాయతీరాజ్‌ కమిషనర్‌గా, కర్నూలు కలెక్టర్‌ పి.కోటేశ్వరరావును పురపాలక శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఇవి చాలా కీలకమైన పోస్టులు. అనంతపురం కలెక్టర్‌ నాగలక్ష్మిని విజయనగరం కలెక్టర్‌గా పంపారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా ఉన్న సృజనను కర్నూలు కలెక్టర్‌గా బదిలీ చేశారు. 

కృష్ణా జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషాను బాపట్ల కలెక్టర్‌గా నియమించారు. జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజాబాబును కృష్ణా కలెక్టర్‌గా నియమించారు. గవర్నర్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, ప్రస్తుతం వెయిటింగ్ లో ఉన్న ఆర్‌పీ సిసోడియాను బాపట్లలోని మానవ వనరుల విభాగం (హెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్‌ జనరల్‌గా నియమించింది. దేవాదాయ శాఖ కమిషనర్‌ హరి జవహర్‌లాల్‌ను కార్మిక శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. స్కిల్‌ డెవలప్ మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఉన్న ఎస్‌.సత్యనారాయణను దేవాదాయ శాఖ కమిషనర్ గా నియమించారు. జెన్‌కో, ట్రాన్స్‌కో ఎండీగా ఉన్న బి.శ్రీధర్‌ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శిగా, నెల్లూరు కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబును జెన్‌కో ఎండీగా బదిలీ చేశారు.


More Telugu News