సంచలన ఆరోపణలతో జైలు నుంచి మరో లేఖ విడుదల చేసిన సుఖేశ్ చంద్రశేఖర్

  • ఈసారి కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రస్తావనతో లేఖ
  • లిక్కర్ స్కాంలో కీలక విషయాలు వెల్లడించిన సుఖేశ్
  • ఏపీ అనే వ్యక్తికి రూ.15 కోట్లు ఇచ్చినట్టు స్పష్టీకరణ
  • తనతో బీఆర్ఎస్ నేత చాట్ చేశారని వెల్లడి
  • రూ.15 కోట్ల డబ్బును 15 కిలోల నెయ్యిగా పేర్కొన్నారని వివరణ
ఘరానా ఆర్థిక మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్ ఈసారి సంచలన ఆరోపణలతో జైలు నుంచి మరో లేఖ విడుదల చేశాడు. తాజా లేఖలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఓ బీఆర్ఎస్ నేత అంటూ పలుమార్లు ప్రస్తావించాడు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ ఆదేశాలతో రూ.15 కోట్లను బీఆర్ఎస్ కార్యాలయానికి చేర్చినట్టు సుఖేశ్ చంద్రశేఖర్ వెల్లడించాడు. 

'ఏపీ' అనే షార్ట్ నేమ్ ఉన్న వ్యక్తికి ఆ డబ్బు ఇచ్చానని తెలిపాడు. 'ఏపీ' అంటే అరుణ్ పిళ్లై అని తెలిపాడు. తాను ఇచ్చిన డబ్బును అరుణ్ పిళ్లై 6060 నెంబరు రేంజ్ రోవర్ కారులో పెట్టాడని సుఖేశ్ తన లేఖలో వివరించాడు. 6060 నెంబరు కారుకు ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉందని స్పష్టం చేశాడు. 

ఆ బీఆర్ఎస్ నేతకు, తనకు మధ్య జరిగిన చాట్ తన వద్ద ఉందని వెల్లడించాడు. త్వరలోనే ఈ చాట్ విడుదల చేయనున్నట్టు తెలిపాడు. డబ్బు అందినట్టు బీఆర్ఎస్ నేత చేసిన చాట్ స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయని వివరించాడు. ఆ బీఆర్ఎస్ నేత ప్రస్తుతం లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని సుఖేశ్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు. 

తన సహాయకుడు అరుణ్ పిళ్లైకి రూ.15 కోట్లు ఇవ్వాల్సిందిగా ఆ బీఆర్ఎస్ నేత చాట్ లో స్పష్టంగా తెలిపారని వెల్లడించాడు. ఆ రూ.15 కోట్ల డబ్బును 15 కేజీల నెయ్యి అనే కోడ్ నేమ్ తో పేర్కొన్నట్టు వివరించాడు.


More Telugu News