నాలుగు సార్లు లేఆఫ్స్.. తట్టుకోలేకపోతున్నానంటూ టెకీ ఆవేదన

  • కెరీర్‌లో నాలుగు సార్లు ఉద్యోగం పోగొట్టుకున్న అమెరికా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
  • మనసుకైన గాయం నుంచి కోలుకోవడం కష్టమని వ్యాఖ్య
  • పెద్ద సంస్థలూ ఉద్యోగులను తొలగించడంపై ఆవేదన
  • కొత్త జాబ్ దొరకడం కష్టంగా ఉందని వ్యాఖ్య
టెక్ రంగంలో నెలకొన్న లేఆఫ్స్‌ పర్వం టెకీల జీవితాలను తలకిందులు చేస్తోంది. ఉద్యోగం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయిన అనేక మంది తమ వ్యథను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తన కెరీర్‌లో నాలుగు సార్లు లేఆఫ్స్ ఎదుర్కొన్నానంటూ ఓ 33 ఏళ్ల అమెరికా మహిళ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. లేఆఫ్స్ మిగిల్చిన గాయం నుంచి కోలుకోవడం అంత సులభం కాదంటూ ఆమె పేర్కొంది. 

ఉద్యోగ జీవితంలో తనకు ఎదురైన అనుభవాలను వివరిస్తూ కాలిఫోర్నియాకు చెందిన జానెట్ ఆన్ పెన్ మీడియాతో తన అనుభవాలను పంచుకుంది. తొలుత ఆమె రెడిట్‌లో చేరింది. కానీ.. రెండు వారాలకే ఆ జాబ్ కోల్పోయింది. ఆ తరువాత ఉబెర్ సంస్థ హెచ్‌ఆర్ విభాగంలో చేరిన ఆమె రెండేళ్లకే మరోమారు ఉద్వాసనకు గురైంది. ఆ తరువాత మరో రెండేళ్లకు డ్రాప్‌బాక్స్ సంస్థ నుంచి పింక్ స్లిప్ అందుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఎలాగోలా కష్టపడి ఆమె స్నాప్‌డాక్స్ సంస్థలో చేరింది. దురదృష్టవశాత్తూ గతవారమే ఆమె ఈ ఉద్యోగం కూడా కోల్పోవాల్సి వచ్చింది. 

‘‘ప్రతిసారీ ఇలా ఉద్యోగం కోల్పోవాల్సి రావడం నా మనసును గాయపరిచింది. నాకే ఎందుకు ఇలా జరుగుతోందో అని బాధపడేదాన్ని. అయితే..మరీ దిగజారిపోకుండా ధైర్యంగా ముందడుగు వేసేందుకు ప్రయత్నిస్తున్నా. ప్రస్తుతం కొత్త జాబ్ దొరకడం కూడా కష్టంగా మారింది. మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ వంటి బడా సంస్థలు కూడా లేఆఫ్స్ ప్రకటించడంతో ఎందరో అనుభవజ్ఞులు ప్రస్తుతం కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. వారితో పోటీపడి కొత్త జాబ్ సంపాదించడం ఎంతో కష్టం’’ అంటూ టెక్ రంగంలోని ప్రస్తుత పరిస్థితులను కళ్లకుకట్టినట్టు వివరించింది ఆ మహిళ.


More Telugu News