కాలం కలిసి రావడమంటే ఇదే: హీరో సుమన్

  • అప్పట్లో కారు బాగుచేయడానికి మెకానిక్ కిట్టు తమ ఇంటికి వచ్చాడన్న సుమన్  
  • సినిమాల్లో నటిస్తావా? అని తననడిగాడని వెల్లడి 
  • ఇంట్రస్ట్ లేదని అతనితో చెప్పానని వ్యాఖ్య  
  • చివరికి అలా టీఆర్ రామన్న గారి సినిమాలో ఛాన్స్ వచ్చిందని వివరణ  
తెలుగు తెరకి యాక్షన్ హీరోగా పరిచయమైన సుమన్, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువవుతూ వచ్చారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నేను సినిమాల్లోకి రావడానికి వెనుక ఒక గమ్మత్తయిన సంఘటన జరిగింది. నా కాలేజ్ రోజుల్లో ఒకసారి ఒక ఫంక్షన్ కి బయల్దేరుతుండగా కారు రిపేర్ వచ్చింది. మాకు తెలిసిన వ్యక్తి ఒకరు, తనకి తెల్సిన మెకానిక్ ను మా ఇంటికి పంపించారు .. అతని పేరు కిట్టూ" అని అన్నారు.

"కిట్టూకి సినిమాలతోను సంబంధం ఉంది .. కారు బాగు చేసిన తరువాత, 'సినిమాల్లో నటిస్తావా?' అని అడిగారు. 'నాకు ఇంట్రస్ట్ లేదు' అని చెప్పాను. కానీ అతను వదిలిపెట్టలేదు .. మా అమ్మగారిని ఒప్పించడానికి ప్రయత్నించడం మొదలుపెట్టాడు. నేను కరాటే క్లాస్ లో ఉండగా అతను 'టీఆర్ రామన్న' గారికి కాల్ చేసి విషయం చెప్పాడు. దాంతో ఆయన నేరుగా వచ్చి చాటు నుంచి నన్ను చూశారు. ఈ విషయం ఆ తరువాత నాకు తెలిసింది" అని చెప్పారు. 

టీఆర్ రామన్న గారు ఎవరంటే .. ఎంజీఆర్ - శివాజీ గణేశన్ తో కలిసి సినిమా చేసిన దర్శకుడు ఆయన ఒక్కడే. ఆయన అనుకున్న కథకి నేను కరెక్టుగా సరిపోతానని భావించి నన్ను ఫాలో అవుతూ వచ్చారు. అమ్మ కూడా యాక్ట్ చేసి చూడు అని చెప్పింది. సెట్లో లైట్లు .. ఆ హడావిడి నచ్చకపోయినా ఒప్పుకున్నాను. అలా నటుడిగా నా ప్రయాణం మొదలైంది. పది భాషల్లో కేవలం హీరోగా చేసిన సినిమాలే 150కి పైగా ఉన్నాయి. కాలం కలిసి రావడమంటే అదే మరి" అని చెప్పుకొచ్చారు.



More Telugu News