కర్ణాటకలో పెను ప్రమాదాన్ని తప్పించిన వృద్ధురాలికి రైల్వే అధికారుల సన్మానం

  • రైల్వే ట్రాక్ పై కూలిన చెట్టు.. మత్స్యగంధ ఎక్స్ ప్రెస్ కు తప్పిన ముప్పు
  • ఎరుపు రంగు క్లాత్ తో లోకో పైలట్ ను అప్రమత్తం చేసిన వృద్ధురాలు
  • మంగళూరులో గత నెల 21 న జరిగిన ఘటన
ఈదురు గాలులకు ఓ భారీ వృక్షం రైల్వే ట్రాక్ పై కూలింది.. అదే సమయంలో దూరం నుంచి ఓ ఎక్స్ ప్రెస్ రైలు ఆ ట్రాక్ పై వేగంగా దూసుకొస్తోంది. ఇంతలో ఆ చెట్టును గమనించిన ఓ వృద్ధురాలు వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. రైలును ఆపడానికి ఆ వృద్ధురాలు చేసిన పనికి ఉన్నతాధికారుల ప్రశంసలు దక్కాయి. మంగళవారం రైల్వే అధికారులు ఆమెను ఘనంగా సన్మానించారు. కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఈ సంఘటన వివరాలు..

మంగళూరుకు చెందిన చంద్రావతి అనే 70 ఏళ్ల మహిళ తన కుటుంబంతో కలిసి ఉంటోంది. వారి ఇంటికి దగ్గర్లో రైల్వే ట్రాక్ ఉంది. గత నెల 21 న రైల్వే ట్రాక్ పై చెట్టు కూలిపడడం చంద్రావతి చూసింది. ఈ విషయం రైల్వే అధికారులను చెప్పి, అప్రమత్తం చేసేందుకు పరుగున ఇంటికి వెళ్లింది. ఇంతలో రైలు కూత వినిపించడంతో చంద్రావతి సమయస్ఫూర్తితో వ్యవహరించింది. ఎలాగైనా ట్రైన్ ను ఆపాలని ఎరుపు రంగు క్లాత్ పట్టుకుని తిరిగి ట్రాక్ దగ్గరికి పరిగెత్తింది. చేతిలోని ఎరుపు రంగు క్లాత్ గాలిలో ఊపుతూ ట్రాక్ వెంబడి పరిగెత్తింది.

దూరం నుంచే ఎరుపు రంగు క్లాత్ చూడడంతో మత్స్యగంధ ఎక్స్ ప్రెస్ లోకో పైలట్ అప్రమత్తమయ్యారు. వెంటనే బ్రేక్ లు వేయడంతో రైలు వేగం తగ్గి, చెట్టు కూలిన చోటుకు దగ్గర్లో ఆగిపోయింది. ట్రాక్ పై కూలిన చెట్టును గమనించిన లోకో పైలట్.. పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. తనను అప్రమత్తం చేసిన చంద్రావతిని మెచ్చుకున్నారు. విషయం ఉన్నతాధికారులకు తెలియజేయడంతో ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన చంద్రావతిని వారు ఘనంగా సన్మానించారు.


More Telugu News