రాజకీయాల్లోకి రమ్మంటున్నారు కానీ.. వాటిని తట్టుకోవడం నా వల్లకాకపోవచ్చు: దిల్ రాజు

  • అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి రావాల్సి ఉంటుందన్న దిల్ రాజు
  • ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదని స్పష్టీకరణ
  • స్వగ్రామంలోని తన ఆలయానికి రేవంత్‌ను ఆహ్వానించినప్పటి నుంచి పుకార్లు
తనను రాజకీయాల్లోకి రమ్మని అడుగుతున్నారని అయితే, ఈ విషయంలో తాను ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయానికి రాలేదని నిర్మాత దిల్ రాజు అన్నారు. చిత్ర పరిశ్రమలోనే ఎవరైనా తనపై విమర్శలు చేస్తే తట్టుకోలేనని అలాంటిది రాజకీయాల్లో తట్టుకోగలనా? అని ఆలోచిస్తున్నట్టు చెప్పారు. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వెళ్లాల్సి ఉంటుందని దిల్ రాజు స్పష్టం చేశారు. ఇప్పటికైతే రాజకీయ విషయం అప్రస్తుతమని అన్నారు. ఆయన నిర్మించిన బలగం సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో నిన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజకీయాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానమిచ్చారు.

దిల్‌రాజు రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన తన స్వగ్రామమైన నిజామాబాద్‌లోని నర్సింగ్‌పల్లిలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించి, నిర్వహిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇటీవల ‘హాత్ సే హాత్ జోడోయాత్ర’లో భాగంగా నిజమాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా దిల్‌రాజు తాను నిర్మించిన ఆలయానికి రేవంత్‌ను ఆహ్వానించారు. అక్కడాయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అది మొదలు దిల్ రాజు రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం మొదలైంది.


More Telugu News