బెంగళూరులో ఆకాశాన్నంటుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ల అద్దెలు

  • భారత్ కు ఐటీ రాజధానిగా వెలుగొందుతున్న బెంగళూరు!
  • కేంద్రాలు ఏర్పాటు చేసుకున్న అంతర్జాతీయ టెక్ సంస్థలు
  • కరోనా సంక్షోభం అనంతరం ఆఫీసులకు వచ్చి పనిచేస్తున్న ఉద్యోగులు
  • బెంగళూరులోని అపార్ట్ మెంట్లన్నీ దాదాపుగా ఫుల్
  • డిమాండ్ పెరగడంతో అద్దెలు పెంచేస్తున్న ఇళ్ల యజమానులు
భారత్ లోని ప్రముఖ ఐటీ నగరాల్లో బెంగళూరు అగ్రగామిగా ఉంది. ప్రపంచస్థాయి టెక్ సంస్థలు ఈ గార్డెన్ సిటీలో తమ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం తెలిసిందే. అయితే, ప్రస్తుతం బెంగళూరులో ఇళ్ల అద్దెలు అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా డబుల్ బెడ్రూం ఇళ్ల అద్దెలకు రెక్కలొచ్చాయి. గతేడాది జనవరితో పోల్చితే ఇప్పుడు రెట్టింపు అద్దెలు వసూలు చేస్తున్నారు. 

బెంగళూరులో ప్రస్తుతం ఓ డబుల్ బెడ్రూం ఇంటికి నెలకు రూ.50 వేల అద్దె చెల్లించాల్సి వస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతో పోల్చితే ఇది ఒకటిన్నర రెట్లు అధికం. అంతేకాదు, ఢిల్లీలోని ఓ డబుల్ బెడ్రూం ఇంటితో పోల్చితే బెంగళూరులోని డబుల్ బెడ్రూం ఇల్లు పరిమాణంలో సగం కూడా లేదని ఓ ఉద్యోగి వాపోయారు. బెంగళూరులో 15 లక్షల మంది ఉద్యోగులు నివసిస్తున్నట్టు తెలుస్తోంది. 

కరోనా సంక్షోభం సమయంలో ఉద్యోగులందరూ సొంతూళ్లకు వెళ్లిపోయి వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేశారు. కరోనా వ్యాప్తి తగ్గిపోవడంతో ఉద్యోగులు తిరిగి బెంగళూరు చేరుకున్నారు. కరోనా వేళ ఖాళీగా ఉన్న అపార్ట్ మెంట్లు ఇప్పుడు ఫుల్ అయిపోయాయి. దాంతో అద్దె ఇళ్లకు డిమాండ్ ఎక్కువైంది. ఇదే అదనుగా ఇళ్ల యజమానులు అద్దెలు భారీగా పెంచేస్తున్నారు. 

డిమాండ్ పెరిగిపోయిన నేపథ్యంలో, అందుకు అనుగుణంగా కొత్త ఇళ్ల నిర్మాణం జరగకపోవడమే ఈ ఇంటి అద్దెల పెరుగుదలకు కారణమని అన్ జెన్ స్పేసెస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని అర్పణ్ బత్రా తెలిపారు.


More Telugu News