నిన్న తెలుగు.. ఇవాళ హిందీ.. వాట్సాప్ లో ప్రత్యక్షమైన పదో తరగతి ప్రశ్నపత్రం

  • ఉదయం 9:30 గంటల నుంచే వాట్సాప్ లో చక్కర్లు
  • వరంగల్ లో హిందీ పేపర్ లీక్ అయిందంటూ ప్రచారం
  • ఆందోళనలో పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు
తెలంగాణలో సోమవారం నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలైన విషయం తెలిసిందే. మొదటి రోజు జరిగిన తెలుగు పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ కలకలం రేగింది. దీనిపై అధికారులు విచారణ జరుపుతుండగానే రెండో రోజు మంగళవారం జరిగిన హిందీ పరీక్షపైనా సందేహాలు నెలకొన్నాయి. హిందీ పేపర్ కూడా లీక్ అయిందని ప్రచారం జరుగుతోంది. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. అంతకుముందే ప్రశ్న పత్రం లీక్ అయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం నుంచే హిందీ పేపర్ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. తెలుగు పేపర్ తాండూర్ లో, హిందీ పేపర్ వరంగల్ జిల్లాకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమయ్యాయి.

పేపర్ లీక్ వార్తల నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే, పేపర్ నిజంగానే లీక్ అయిందా.. లేక ఆకతాయిలు చేసిన పనా అనేది తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేపర్ లీక్ వార్తలను జిల్లా విద్యాశాఖ అధికారులు కొట్టిపడేశారు. లీక్ విషయంపై తమకు ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు.


More Telugu News