ఫలించిన డ్రైవర్ నిరీక్షణ.. రూ.49 పెట్టుబడితో రాత్రికి రాత్రి రూ.1.5 కోట్ల ఆదాయం

  • మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన ఉదంతం
  • రెండేళ్లుగా ఆన్‌లైన్ క్రికెట్ యాప్‌లో గేమ్స్ ఆడుతున్న డ్రైవర్
  • ఆదివారం వర్చువల్ టీం రూపకల్పనతో కలిసొచ్చిన అదృష్టం
  • ‘49 కేటగిరీ’  తొలిస్థానంలో నిలిచి రూ.1.5 కోట్లు గెలుచుకున్న డ్రైవర్
అదృష్టం కోసం రెండేళ్లపాటు ఓపిగ్గా ఎదురు చూసిన ఓ డ్రైవర్ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. రూ. 49 పెట్టుబడితో అతడు రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు. ఏకంగా రూ. 1.5 కోట్లు సొంతం చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాలో ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కారు నడుపుకుని పొట్టపోసుకునే షహాబుద్దీన్ మన్సూరీ గత రెండేళ్లుగా ఆన్‌లైన్ క్రికెట్ గేమ్స్ ఆడుతున్నాడు. గేమింగ్ యాప్స్‌లో వర్చువల్ క్రికెట్ టీమ్స్ రూపొందించి లక్ కోసం గాలం వేసేవాడు. 

అయితే..ఈమారు అతడి టైం కలిసొచ్చింది. ఆదివారం నాటి కోల్‌కతా-పంజాబ్ మ్యాచ్ సందర్భంగా అతడు ‘49 కేటగిరీలో’ ఓ వర్చువల్ టీం రూపొందించి తొలిస్థానంలో నిలిచాడు. దీంతో.. ఏకంగా రూ.1.5 కోట్లు అతడి సొంతమైంది. యాప్‌లో అతడి పేరిట ఉన్న వాలెట్‌లో ఈ మొత్తం జమ అయ్యింది. ఇప్పటికే షాహబుద్దీన్ తన వ్యాలెట్‌లోని రూ.20 లక్షలను విత్‌గ్రా చేసుకున్నాడు. ఇందులో ఆరు లక్షలు పన్ను కింద పోగా మిగిలిన 14 లక్షల అతడి బ్యాంకు అకౌంట్‌కు చేరింది. 

తన కల ఇన్నాళ్లకు ఫలించడంతో షహాబుద్దీన్ ఆనందానికి అంతేలేకుండా పోయింది. మధ్యప్రదేశ్‌లోని సెంథ్వా ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో నివసించే అతడు ఈ డబ్బుతో ఓ సొంతిల్లు కొనుక్కుంటానని మీడియాకు చెప్పాడు. అంతేకాకుండా.. మిగిలిన డబ్బుతో సొంతంగా ఓ వ్యాపారం కూడా ప్రారంభిస్తానని పేర్కొన్నాడు.


More Telugu News