పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ హింస.. నిలిచిపోయిన రైలు సర్వీసులు

  • పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న అల్లర్లు
  • హౌరా-బర్ధమాన్ రైల్వే లైన్‌లో మూడు గంటలపాటు రైలు సర్వీసుల నిలిపివేత
  • బీజేపీ, టీఎంసీ పరస్పర ఆరోపణలు
పశ్చిమ బెంగాల్‌లో అలర్లు కొనసాగుతున్నాయి. గత రాత్రి హుగ్లీ రైల్వే స్టేషన్‌‌పై రాళ్ల దాడి జరిగింది. ఫలితంగా హౌరా-బర్ధమాన్ రైల్వే లైన్‌లో లోకల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలను మూడు గంటలపాటు నిలిపివేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రైలు సేవలను నిలిపివేసినట్టు తూర్పు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కౌశిక్ మిరాన్ తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట వరకు రైలు సేవలను నిలిపివేసినట్టు చెప్పారు. ఫలితంగా కొన్ని లోకల్ రైళ్లతోపాటు దూరప్రాంతాల రైళ్లు ఆలస్యమైనట్టు పేర్కొన్నారు. 

శ్రీరామ నవమి ఊరేగింపు సందర్భంగా ఆదివారం హుగ్లీ జిల్లాలోని రిష్రాలో రెండు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇది హింసాత్మక ఘటనలకు దారితీయకుండా ఈ నెల 2, 3 తేదీల్లో ఇంటర్నెట్‌ను నిలిపివేయడంతోపాటు 144 సెక్షన్ విధించారు. 

అల్లర్లపై బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు సుకాంత మజుందార్ మాట్లాడుతూ... ముందస్తు ప్రణాళికలో భాగంగానే అల్లర్లు జరిగాయన్నారు. అల్లర్లు జరిగిన రిష్రా ప్రాంతంలో పర్యటించనున్నట్టు చెప్పారు. ఆందోళనకారులకు టీఎంసీ ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించారు. హౌరా, రిష్రాలో అల్లర్ల నేపథ్యంలో అక్కడి శాంతి భద్రతల పరిస్థితిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరా తీసినట్టు తెలిపారు.

మరోవైపు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేంద్ర బలగాలు రాష్ట్రానికి వచ్చి ఫైవ్ స్టార్ హోటళ్లలో బసచేసి అల్లర్లను ప్రేరేపిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ నేతలతో సమావేశమైన తర్వాత బలగాలు తిరిగి వెళ్లిపోయాయన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పార్టీకి ఓటెయ్యొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


More Telugu News