మరోమారు రెచ్చగొడుతున్న చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాల పేర్ల మార్పు!

  • గతంలో రెండుసార్లు పేర్లు పెట్టిన చైనా
  • మూడో విడతగా మరికొన్ని ప్రాంతాల ఎంపిక
  • చైనీస్, టిబెటిన్, పిన్యన్ అక్షరాలతో పేర్ల విడుదల
  • అరుణాచల్ ప్రదేశ్ తమ అంతర్భాగమన్న భారత్
చైనా మరోమారు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌లోని జంగ్నమ్‌గా పేర్కొంటున్న డ్రాగన్ కంట్రీ.. అక్కడి 11 ప్రాంతాల పేర్లను మార్చేందుకు రెడీ అయింది. చైనా కేబినెట్ జారీ చేసిన భౌగోళిక పేర్లపై నిబంధనలను అనుసరించి చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వశాఖ తాజాగా చైనీస్, టిబెటన్, పిన్యిన్ అక్షరాలతో ప్రామాణిక పేర్లను విడుదల చేసింది. 

ఈ జాబితాలో రెండు భూభాగాలు, ఐదు పర్వత శిఖరాలు, రెండు నదులతోపాటు సబార్డినేట్ అడ్మినిస్ట్రేటివ్ జిల్లాలు ఉన్నాయి. ఈ విషయాన్ని చైనా అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ వెల్లడించింది. 2017లో తొలి విడతలో ఆరు ప్రాంతాలకు, 2021లో రెండో విడతలో 15 ప్రాంతాలకు పేర్లు పెట్టిన చైనా, ఇప్పుడు మూడో విడతలో 11 ప్రాంతాలకు పేర్లు పెట్టబోతున్నట్టు రాసుకొచ్చింది. అంతేకాదు, పేర్ల ప్రకటన చట్టబద్ధమైన చర్య అని, అది చైనా సార్వభౌమ హక్కు అని చైనా నిపుణులను ఉటంకిస్తూ పేర్కొంది.

అరుణాచల్ ప్రదేశ్‌లో స్థలాల పేర్లను మారుస్తూ రెచ్చగొడుతున్న చైనాపై భారత ప్రభుత్వం గతంలో తీవ్రంగా మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. పేర్లను కేటాయించడం ద్వారా వాస్తవాన్ని కప్పిపుచ్చలేరని స్పష్టం చేసింది.


More Telugu News