అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. రేపల్లెలో ఉద్రిక్తత

  • అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న ప్రైవేటు ఉద్యోగి
  • పట్టుకుని చితకబాదిన ఆందోళనకారులు
  • అడ్డుకున్న ఎస్సైలపైనా దాడి
  • పోలీసు వాహనం ధ్వంసం
  • గాయపడిన బాధితుడిని గుంటూరు ఆసుపత్రికి తరలించిన పోలీసులు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై ఓ ప్రైవేటు ఉద్యోగి చేసిన వ్యాఖ్యలతో బాపట్ల జిల్లా రేపల్లెలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోని స్టేట్‌ బ్యాంక్ సమీపంలోని ఓ ప్రైవేటు గోల్డ్ లోన్ బ్యాంకులో పనిచేసే ఈశ్వర్.. అంబేద్కర్‌పై అనుచిత కామెంట్స్‌ చేస్తూ వాటిని తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఆ వెంటనే అవి వైరల్‌గా మారడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఈశ్వర్‌ను పట్టుకుని దాడిచేశారు. విచక్షణ రహితంగా కొట్టారు. 

సమాచారం అందుకున్న రేపల్లె ఎస్సైలు భరత్‌కుమార్, అబ్దుల్ కుమార్ అక్కడికి చేరుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన ఆందోళనకారులు వారిపైనా దాడిచేశారు. వారి వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

అతి బలవంతం మీద ఈశ్వర్‌ను కారులోకి ఎక్కించిన పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అప్పుడు కూడా ఆందోళనకారులు కారుపై దాడిచేసి అద్దాలు పగలగొట్టారు. చివరికి ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు ఈశ్వర్‌ను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News