ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోల హతం

  • ఝార్ఖండ్‌లోని పలాము-ఛాత్రా జిల్లాల సరిహద్దులో ఘటన
  • మరికొందరు మావోయిస్టులకు బుల్లెట్ గాయాలు
  • ఘటనా స్థలం నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం
ఝార్ఖండ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోలు హతమయ్యారు. మరికొందరు గాయపడ్డారు. రాష్ట్రంలోని పలాము- ఛాత్రా జిల్లాల్లోని సరిహద్దులో నక్సల్స్ దాగి ఉన్నారన్న సమాచారంతో ఝార్ఖండ్ పోలీసులు, సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్సు (సీఆర్‌పీఎఫ్) సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్టు ఛాత్రా ఎస్పీ రాకేశ్ రంజన్ తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు నక్సల్స్ చనిపోయారని, మరికొందరికి బుల్లెట్ గాయాలైనట్టు పేర్కొన్నారు.

ఘటనా స్థలం నుంచి ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలతోపాటు, ఆయుధాలను కూడా పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. మృతుల్లో రూ. 25 లక్షల రివార్డు ఉన్న స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు గౌతమ్ పాశ్వాన్ కూడా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.


More Telugu News