తెలంగాణలో టెన్త్ ప్రశ్నాపత్రం లీక్... టీచర్ అరెస్ట్

  • వికారాబాద్ జిల్లాలో తాండూర్ లో పేపర్ లీక్
  • పేపర్ లీక్ చేసిన టీచర్ బందెప్ప
  • ముగ్గురు విద్యాశాఖ ఉద్యోగుల సస్పెన్షన్
  • ఉమ్మడి విచారణ చేపట్టిన పోలీస్, విద్యాశాఖ
తెలంగాణలో నేడు పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. అయితే, వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ప్రశ్నాపత్రం లీకైంది. టీచర్ బందెప్ప ఫోన్ నుంచి తెలుగు పేపర్ లీకైనట్టు గుర్తించారు. క్వశ్చన్ పేపర్ స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షం కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పరీక్ష ప్రారంభమైన కాసేపటికే తెలుగు పేపర్ బయటికి రావడంతో కలకలం రేగింది. ఈ పరిణామంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. 

పేపర్ లీక్ పై మండల విద్యాధికారి వెంకయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు టీచర్ బందెప్పను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై వికారాబాద్ ఏఎస్పీ మురళి వివరణ ఇచ్చారు. 

స్కూల్ టీచర్ బందెప్ప తెలుగు పేపర్ ను వాట్సాప్ ద్వారా షేర్ చేశాడని వెల్లడించారు. ఉదయం 9.37 గంటలకు పేపర్ ను వాట్సాప్ గ్రూపులో పెట్టాడని వివరించారు. అప్పటికే విద్యార్థులంతా పరీక్ష హాల్లోనే ఉన్నారని తెలిపారు. వాట్సాప్ గ్రూపులో ఉన్నవారు ఆ మెసేజ్ ను ఉదయం 11 గంటలకు చూశారని ఏఎస్పీ వెల్లడించారు. ఎగ్జామ్ హాల్ నుంచి క్వశ్చన్ పేపర్ ను బయటికి షేర్ చేసినందుకు ఇన్విజిలేటర్ పై కేసు నమోదు చేస్తామని చెప్పారు. 

కాగా, టెన్త్ పేపర్ లీక్ ఘటనపై విచారణ వేగవంతం అయింది. పోలీస్ విభాగం, విద్యాశాఖ ఉమ్మడిగా విచారణ చేపట్టాయి. ఇప్పటికే ముగ్గురు విద్యాశాఖ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. తాండూర్ లో స్కూల్ నెం.1 సెంటర్ చీఫ్ సూపరింటిండెంట్, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ బందెప్పలను సస్పెండ్ చేశారు. 

టెన్త్ పరీక్షల్లో ఇన్విజిలేటర్ గా వ్యవహరిస్తున్న టీచర్ బందెప్పకు గతంలో నేర చరిత్ర ఉన్నట్టు వెల్లడైంది. గతంలో బందెప్పపై పోక్సో కింద కేసు నమోదైంది. బందెప్ప 2017లో టెన్త్ క్లాస్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి.


More Telugu News