రెండు కార్లు ఉపసంహరణ.. హోండా నుంచి ప్రస్తుతం రెండే కార్లు..
- ఉత్పత్తుల జాబితాలో కనిపించని డబ్ల్యూఆర్-వీ, హోండా జాజ్
- ప్రస్తుతం హోండా సీటీ, అమేజ్ మోడళ్లే విక్రయం
- ఈ ఏడాది చివరికి మధ్య స్థాయి ఎస్ యూవీ లాంచ్
హోండా కార్స్ ఇండియా.. భారత మార్కెట్లో చివరికి రెండే కార్లను విక్రయిస్తోంది. వినియోగదారుల ఆదరణకు నోచుకున్న హోండా డబ్ల్యూఆర్-వీ, హోండా జాజ్ మోడళ్లను సంస్థ తన ఉత్పత్తుల పోర్ట్ ఫోలియో నుంచి తొలగించింది. దీంతో ప్రస్తుతం హోండా కార్స్ ఇండియా కేవలం.. సిటీ, అమేజ్ వేరియంట్ల విక్రయాలకే పరిమితమైంది.
నిజానికి చాలా కాలంగా జాజ్, డబ్ల్యూఆర్-వీ మోడళ్లను కంపెనీ ఉపసంహరించుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి బీఎస్ 6 స్థానంలో బీఎస్ 6.2 కాలుష్య విడుదల ప్రమాణాలు అమల్లోకి వచ్చాయి. దీంతో హోండా ఈ రెండింటినీ అప్ గ్రేడ్ చేయకుండా తొలగించింది. ప్రస్తుతం న్యూ సిటీ 5వ జనరేషన్, న్యూ సిటీ ఈ హెచ్ఈవీ, అమేజ్ మోడళ్లు కంపెనీ పోర్టల్ లో దర్శనమిస్తున్నాయి.
ఈ ఏడాది చివరికి హోండా కార్స్ ఓ మధ్య స్థాయి ఎస్ యూవీని మార్కెట్లోకి తీసుకురానుంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా హ్యారియర్, వోక్స్ వ్యాగన్ టైగన్, స్కోడా కుషక్ తదితర మోడళ్లకు పోటీగా రానుంది. 2017లో డబ్ల్యూ ఆర్ -వీ విడుదల కాగా, దీని ధరలు రూ.9-12 లక్షల మధ్యలో ఉన్నాయి. ఆ తర్వాత 2009లో విడుదలైన జాజ్ కూడా మంచి ఆధరణ సంపాదించింది. కానీ, ఎస్ యూవీలకు ఆదరణ పెరగడంతో, ఈ ఉత్పత్తులకు డిమాండ్ క్రమంగా తగ్గింది.