నేడు చెన్నైలో సీఎస్కే తొలి పోరు.. స్టోక్స్ గాయంపై జట్టు ఆందోళన!

  • తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన ధోనీసేన
  • నాలుగేళ్ల తర్వాత చెపాక్ లో ఈ రోజు బరిలోకి
  • బలమైన లక్నోతో పోటీ పడనున్న సీఎస్కే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ని నిరాశాజనకంగా ప్రారంభించిన ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ ఈ రోజు రాత్రి (సోమవారం) తమ సొంత స్టేడియం చెపాక్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. అహ్మదాబాద్ లో తొలి పోరులో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఎదురైన ఓటమిని మరిచి సొంతగడ్డపై గెలుపు రుచి చూడాలని ఆశిస్తోంది. నాలుగు సంవత్సరాల విరామం తర్వాత చెన్నైలో మ్యాచ్ ఆడబోతున్న సీఎస్కేని ఓ సమస్య వేధిస్తోంది. అదే ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఫిట్ నెస్. మార్చిలో మోకాలి గాయానికి గురైన స్టోక్స్ దాని నుంచి పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. 

అందుకే మోకాలిపై ఎక్కువ ఒత్తిడి పడకుండా తొలి మ్యాచ్ లో అతను కేవలం బ్యాటింగ్ మాత్రమే చేశాడు. ఇకపైనా అతను బ్యాటర్ గానే కొనసాగుతాడని తెలుస్తోంది. ఇది చెన్నైని కలవర పెడుతోంది. ప్రధాన ఆల్ రౌండర్ అయిన స్టోక్స్ బౌలింగ్ చేయకపోవడం తొలి మ్యాచ్ లో చెన్నైని దెబ్బతీసింది. తను బ్యాటింగ్ లోనూ నిరాశ పరిచాడు. ఈ నేపథ్యంలో బలమైన లక్నోతో మ్యాచ్ లో స్టోక్స్ ను ఆడించాలా? అతని స్థానంలో డ్వైన్ ప్రిటోరియస్ ను తుది జట్టులో గానీ లేదంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దింపాలని సీఎస్కే భావిస్తున్నట్టు తెలుస్తోంది.


More Telugu News