కోదాడలో అత్తారింటి ముందు అల్లుడి ధర్నా

  • తన కొడుకును చూడనివ్వట్లేదంటూ ఆవేదన
  • కోర్టు తీర్పునూ లెక్కచేయట్లేదంటూ ఆరోపణ
  • ఏడాదిన్నరగా కన్న కొడుకును కలుసుకోలేదని వాపోయిన తండ్రి
తన కొడుకును తనకు దూరం చెయ్యొద్దంటూ ఓ తండ్రి ఆందోళన చేస్తున్నాడు. అత్తారింటి ముందు తన తల్లిదండ్రులతో కలిసి ధర్నాకు దిగాడు. ఏడాదిన్నరగా తన కొడుకును కలవనివ్వడంలేదని, కోర్టు తీర్పును కూడా అమలుచేయట్లేదని వాపోతున్నాడు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఆదివారం చోటుచేసుకుందీ ఘటన.

హైదరాబాద్ కు చెందిన ప్రవీణ్ కుమార్ కు కోదాడకు చెందిన రమణి పృథ్వితో 2018లో వివాహం జరిగింది. మూడేళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగింది.. ఓ కొడుకు కూడా పుట్టాడు. అయితే, 2021లో భార్యాభర్తల మధ్య విభేదాలు పొడసూపాయి. దీంతో రమణి పృథ్వి కొడుకును తీసుకుని కోదాడలోని పుట్టింటికి చేరుకుంది. ఆ తర్వాత కొడుకును తల్లిదండ్రుల వద్ద వదిలి కెనడా వెళ్లింది. దీంతో ప్రవీణ్ కుమార్ కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. వారానికోమారు తండ్రీకొడుకులు కలుసుకునేందుకు వీలు కల్పించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఏడాదిన్నరగా తన కొడుకును చూసుకునేందుకు ప్రవీణ్ ఎన్నిమార్లు ప్రయత్నించినా అత్తామామలు కుదరనివ్వలేదు. దీంతో తన కొడుకును తనకు చూపించాలంటూ తల్లిదండ్రులతో కలిసి ప్రవీణ్ అత్తారింటి ముందు ధర్నాకు దిగాడు. కొడుకు కోసం కొన్న ఆట వస్తువులను ప్రదర్శిస్తూ అత్తామామల తీరుపై నిరసన వ్యక్తం చేశాడు.


More Telugu News