కోహ్లీ, డుప్లెసిస్ విశ్వరూపం... బెంగళూరు శుభారంభం

  • ముంబయి ఇండియన్స్ పై 8 వికెట్ల తేడాతో గెలిచిన బెంగళూరు
  • బెంగళూరు టార్గెట్ 172 రన్స్
  • కోహ్లీ, డుప్లెసిస్ అర్ధసెంచరీలు
  • తొలి వికెట్ కు 148 రన్స్ జోడించిన కోహ్లీ, డుప్లెసిస్
  • 16.2 ఓవర్లలోనే లక్ష్యఛేదన పూర్తి
ఇటీవలే ఫామ్ అందుకున్న బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లీ, ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఇవాళ ఐపీఎల్ లో విశ్వరూపం ప్రదర్శించారు. రాయల్ చాలెంజర్స్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ లో ఈ జోడీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. వీరిద్దరూ తొలి వికెట్ కు 148 పరుగులు జోడించి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించారు. 

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. తెలుగుతేజం తిలక్ వర్మ 84 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక, 172 పరుగుల లక్ష్యఛేదనలో బెంగళూరు 16.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. 

కోహ్లీ 49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ దూకుడుకు ముంబయి బౌలర్లు కుదేలయ్యారు. జోఫ్రా ఆర్చర్, బెహ్రెండార్ఫ్, కామెరాన్ గ్రీన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దాదాపు ముంబయి బౌలర్లందరూ కోహ్లీ దూకుడుకు బలయ్యారు. 

కెప్టెన్ డుప్లెసిస్ సైతం విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. డుప్లెసిస్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులతో 73 పరుగులు చేశాడు. చివర్లో గ్లెన్ మ్యాక్స్ వెల్ 3 బంతులాడి రెండు సిక్సులతో 12 పరుగులు చేయడం విశేషం. విన్నింగ్ షాట్ కొట్టే అవకాశం మాత్రం కోహ్లీకి దక్కింది. అర్షద్ ఖాన్ వేసిన బంతిని కోహ్లీ ఫ్లాట్ సిక్స్ కొట్టాడు.


More Telugu News