కోపిష్టిని కనుక నా దగ్గరకి వచ్చావా అని మోహన్ బాబు అడిగేశారు: గుణశేఖర్

  • 'శాకుంతలం'లో దుర్వాసుడుగా మోహన్ బాబు
  • ఆ పాత్రకి ఆయనే కరెక్టని చెప్పిన గుణశేఖర్ 
  • అందుకే ఆయనని సంప్రదించానని వెల్లడి
  • ఆయనను అలా ఒప్పించానని వ్యాఖ్య  

గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'శాకుంతలం' ఈ నెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గుణశేఖర్ ఈ సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'అభిజ్ఞాన శాకుంతలం'లో దుర్వాస మహర్షిని గురించి కాళిదాసు చేసిన వర్ణనకి మోహన్ బాబు పెర్ఫెక్ట్ గా సరిపోతారని అనిపించింది" అని అన్నారు. 

"గతంలో నేను 'రుద్రమదేవి' సినిమాలోని ఒక పాత్ర కోసం మోహన్ బాబుగారి దగ్గరికి వెళితే, ఆ పాత్రను చేయడానికి ఆయన ఆసక్తిని చూపలేదు. ఈ సినిమాలో మాత్రం దుర్వాసుడి పాత్ర ఆయన చేయడమే కరెక్టు అని భావించి వెళ్లి కలిశాను. ''శాకుంతలం'లో ఒక పాత్ర ఉంది .. అది మీరే చేయాలి. లేదంటే ఎవరు చేస్తే బాగుంటుందో మీరే చెప్పాలి" అన్నాను. 

"ఇంతకీ ఏమిటా సినిమా .. ఏమిటా పాత్ర" అని ఆయన అడిగితే. సినిమా పేరు 'శాకుంతలం' .. దుర్వాసుడి పాత్ర అని చెప్పాను. ఆయన పెద్దగా నవ్వేసి "నేను కోపిష్టిని కనుక నా దగ్గరికి వచ్చావా? అన్నారు. ''దుర్వాస మహర్షి ఎంత కోపిష్టినో అంత సున్నిత మనస్కుడు .. నాకు మీరే కరెక్టు అనిపించారు'' అన్నాను. "అవును .. నేనే కరెక్ట్ .. చేస్తున్నాను" అన్నారు అంటూ చెప్పుకొచ్చారు.


More Telugu News