సీఎం పదవి పోతుందనే భయంతోనే కేసీఆర్ భద్రాచలంకు వెళ్లడం లేదు: లక్ష్మణ్

  • భద్రాద్రి రాముడిని కూడా కేసీఆర్ అవమానిస్తున్నారన్న లక్ష్మణ్
  • మూఢ విశ్వాసాలు ఈసారి కేసీఆర్ ను గట్టెక్కించలేవని వ్యాఖ్య
  • ఎన్నికలు వస్తేనే బీఆర్ఎస్ నేతలకు ప్రజలు గుర్తుకొస్తారని విమర్శ
శ్రీరామనవమినాడు భద్రాచలం ఆలయంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి వెళ్లడం ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీతారాములుకు ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామనవమికి భద్రాచలంకు వెళ్లడం లేదు. ఈ ఏడాది కూడా ఆయన వెళ్లకపోవడం తెలిసిందే. 

దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ, భద్రాద్రి రాముడుని కూడా కేసీఆర్ అవమానిస్తున్నారని విమర్శించారు. మూఢనమ్మకాల్లో కూరుకుపోయిన కేసీఆర్... భద్రాచలంకు వెళ్తే సీఎం పదవి పోతుందని భావిస్తున్నారని... అందుకే శ్రీరామనవమికి భద్రాచలంకు వెళ్లలేదని అన్నారు. కేసీఆర్ మూఢ విశ్వాసాలు ఈసారి ఆయనను ఓటమి నుంచి గట్టెక్కించలేవని చెప్పారు. ఎన్నికలు వస్తే తప్ప బీఆర్ఎస్ నేతలకు ప్రజలు గుర్తుకు రారని విమర్శించారు. 

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పంపుతున్న నిధులను దారి మళ్లిస్తున్నారని లక్ష్మణ్ దుయ్యబట్టారు. ఈ నెల 8న తెలంగాణలో రూ. 20 వేల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని చెప్పారు. పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా సమావేశాల్లో హరీశ్ రావు అడ్డుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీపై విద్యాశాఖ మంత్రి కానీ, హోం మంత్రి కానీ మాట్లాడరని... కేటీఆర్ మాత్రమే గుమ్మడికాయ దొంగలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.


More Telugu News