రాజకీయాలపై పూర్తి అవగాహన ఉంది: పొలిటికల్ ఎంట్రీపై విజయ్ సేతుపతి స్పందన
- విజయ్ సేతుపతి రాజకీయాల్లోకి వస్తున్నారంటూ తమిళనాట ప్రచారం
- ఇప్పట్లో రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదన్న సేతుపతి
- భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనని వ్యాఖ్య
తమిళ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు ప్రముఖ సినీ నటుడు విజయ్ సేతుపతి పేరు బాగా వినిపిస్తోంది. విజయ్ సేతుపతి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారని, సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై విజయ్ సేతుపతి స్పందిస్తూ... తనకు రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉందని చెప్పారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని తెలిపారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనని అన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ 70వ పుట్టినరోజును పురస్కరించుకుని చెన్నైలోని తేనాంపేటలో 'స్టాలిన్ 70' పేరుతో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ను విజయ్ సేతుపతి తిలకించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ తన రాజకీయ ప్రవేశంపై ఆయన స్పందించారు. ఇదే సమయంలో స్టాలిన్ పై ఆయన ప్రశంసలు కురిపించారు. వారసత్వంతో స్టాలిన్ సీఎం కాలేదని... కఠోరశ్రమతో సీఎం పదవిని చేపట్టారని చెప్పారు.