బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై విమర్శల వెల్లువ

  • వారం రోజుల్లో ప్రధాని ప్రైవేటు విమాన ప్రయాణలపై ఐదు లక్షల పౌండ్ల ఖర్చు
  • గార్డియన్ పత్రిక కథనంలో వెల్లడి
  • దుబారా ఖర్చులు చేస్తున్నారంటూ రిషిపై ప్రతిపక్షాల విమర్శలు
  • అధికార పక్షానికి వాస్తవం పట్టట్లేదని ఆగ్రహం
కేవలం వారం రోజుల వ్యవధిలో విమాన ప్రయాణాలపై 5 లక్షల పౌండ్లు ఖర్చు చేసిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన గతంలో ఇచ్చిన హామీలకు ఇది పూర్తి విరుద్ధమని ప్రతిపక్ష సభ్యులు దుమ్మెత్తిపోస్తున్నారు. కనీసావసరాలు తీరక ప్రజలు అలమటిస్తుంటే అధికార పక్షం పన్నుల సొమ్మును వృథా చేస్తోందని దుయ్యబట్టారు. బ్రిటన్ ప్రధాని ప్రయాణ ఖర్చులపై ప్రభుత్వ గణాంకాల ఆధారంగా గార్డియన్ పత్రిక ఇటీవల ప్రచురించిన కథనం ప్రస్తుతం బ్రిటన్‌లో కలకలం రేపుతోంది. 

జనవరిలోనూ బ్రిటన్ ప్రధానిపై ఇదే తరహా విమర్శలు వెల్లువెత్తాయి. అప్పట్లో ఆయన లండన్‌ నుంచి లీడ్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ప్రైవేటు జెట్‌లో వెళ్లడం వివాదాస్పదంగా మారింది. గమ్యస్థానం చేరువలోనే ఉప్పటికీ రిషి ప్రైవేట్ జెట్ వినియోగించడం వివాదానికి దారితీసింది. 

రిషి ప్రైవేట్ జెట్ ప్రయాణాలు ప్రతిపక్షాలకు ఓ ఆయుధంగా మారాయి. వారు రిషిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ప్రజలు చెల్లిస్తున్న పన్నులను ఈ స్థాయిలో వృథా చేయడం విస్మయపరుస్తోంది’’ అని లిబరల్ డెమొక్రాట్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కనీసావసరాలు తీర్చుకునేందుకు కూడా డబ్బుల్లేక ప్రజలు అలమటిస్తుంటే అధికార పార్టీ మాత్రం వాస్తవపరిస్థితులతో సంబంధం లేకుండా ప్రవర్తిస్తోందని మండిపడుతున్నారు. పర్యావరణ పరీక్షణ కోసం కట్టుబడి ఉన్నట్టు అధికార పార్టీ నటిస్తోందని మరికొందరు విమర్శించారు.


More Telugu News