ఇక వాట్సాప్ లోనూ పోస్టల్ బ్యాంకింగ్ సేవలు

  • ఎయిర్ టెల్ కంపెనీతో ఇండియా పోస్ట్ భాగస్వామ్యం
  • కస్టమర్లకు మరిన్ని సేవలు అందించేందుకేనని వెల్లడి
  • గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్లకు ఎంతో ఉపయోగం
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాదారులు ఇకపై వాట్సాప్ ద్వారా సేవలు అందుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ తో కలిసి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఈ సేవలను అందించనుందని పేర్కొంది. ఈమేరకు ఇండియా పోస్ట్, ఎయిర్ టెల్ మధ్య భాగస్వామ్యం కుదిరిందని ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ కొత్త సిస్టమ్ లో పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కస్టమర్లు తమ మొబైల్ ఫోన్ ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చని అధికారులు తెలిపారు. కస్టమర్లు వాయిస్, ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా తమ ఖాతాలను నిర్వహించుకునే సౌకర్యం కల్పించినట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్లకు వాట్సాప్ బ్యాంకింగ్ సేవల ద్వారా మరింత ప్రయోజనం కలగనుందని తెలిపారు.

దేశంలో డిజిటల్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌ను ప్రోత్సహించడానికి భారతీ ఎయిర్‌టెల్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సీజీఎం అండ్‌ సీఎస్‌ఎంవో గురుశరణ్ రాయ్ బన్సాల్ చెప్పారు. ఈ నిర్ణయంతో దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు పోస్ట్ పేమెంట్స్ బ్యాంకింగ్ సేవలను అందించడం మరింత సులభంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను విస్తరించేందుకు పోస్టల్ బ్యాంక్ తో కలిసి తోడ్పడతామని ఎయిర్‌టెల్ ఐక్యూ బిజినెస్ హెడ్ అభిషేక్ బిస్వాల్ వివరించారు.


More Telugu News