కనుమరుగు కాబోతున్న మారుతి ఆల్టో 800 కార్లు

  • ఉత్పత్తిని నిలిపివేసిన మారుతి సుజుకి ఇండియా
  • ప్రస్తుతం ఉన్న కార్లను మాత్రమే విక్రయించనున్న సంస్థ
  • డిమాండ్ తగ్గడం, ఉత్పత్తి వ్యయం పెరగడంతోనే ఈ నిర్ణయం
మధ్య తరగతి ప్రజలకు ఎంతో చేరువైన మారుతి ఆల్టో 800 కార్లు ఇక కనుమరుగు కానున్నాయి. సుజుకి ఇండియా తన ప్రారంభ స్థాయి మోడల్ అయిన ఆల్టో 800 ఉత్పత్తిని నిలిపివేసింది. హ్యాచ్‌బ్యాక్ సెక్టార్ లో ప్రస్తుతం మిగిలిన స్టాక్ ను మాత్రమే విక్రయించనుంది. ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో డిమాండ్ తగ్గడంతో ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే బీఎస్ 6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా ఆల్టో 800ని అప్‌గ్రేడ్ చేయడం ఆర్థికంగా లాభదాయకం కాదని సుజుకి ఇండియా భావిస్తోంది.

2016 ఆర్థిక సంవత్సరరంలో దాదాపు 4,50,000 యూనిట్లతో ప్రారంభ స్థాయి హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ వాటా మార్కెట్‌లో దాదాపు 15 శాతంగా ఉంది. కానీ, 2023 ఆర్థిక సంవత్సరానికి వచ్చే సరికి కేవలం 2,50,000 యూనిట్ల అంచనా వాల్యూమ్‌లతో మార్కెట్ లో వీటి వాటా 7 శాతాని కంటే దిగువకు పడిపోయింది. మారుతి అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఆల్టో 800 ధర రూ. 3.54 లక్షల నుంచి రూ. 5.13 లక్షల మధ్య (ఢిల్లీ ఎక్స్-షోరూమ్) ఉంది.

ఈ కార్ల ఉత్పత్తిని నిలిపి వేసి ఆల్టో కే10ను ఇప్పుడు తమ ప్రారంభ స్థాయి మోడల్ గా అందుబాటులో ఉంచాలని కంపెనీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీని ధర రూ. 3.99 లక్షల నుంచి రూ. 5.94 లక్షల ( ఢిల్లీ ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. మారుతి సుజుకి ఆల్టో 800 మోడల్ ను మన దేశంలో 2000వ సంవత్సరంలో ప్రారంభించింది. 2010 వరకు 18 లక్షల యూనిట్ల కార్లను విక్రయించింది. 2010లో ఆల్టో కే10 మోడల్ మార్కెట్‌ లోకి వచ్చింది. అప్పటి నుంచి 17 లక్షల ఆల్టో 800 కార్లను, 9.5 లక్షల ఆల్టో కే10 కార్లను విక్రయించింది. మొత్తంగా 44.50 లక్షల యూనిట్ల ఆల్టో బ్రాండ్ కార్లను కంపెనీ వినియోగదారులకు అందించింది. 

కానీ, గత కొన్నేళ్ల నుంచి ఎంట్రీ లెవెల్ కార్ల అమ్మకాలు తగ్గిపోతున్నాయని, అదే సమయంలో ఉత్పత్తి ఖర్చు పెరుగుతోందని మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. అందుకే ఆల్టో 800 ఉత్పత్తిని కంపెనీ నిలిపివేసినట్లు చెప్పారు.


More Telugu News