బెంగళూరులో దారుణం.. నడుస్తున్న కారులో యువతిపై సామూహిక అత్యాచారం

  • పార్కులో కూర్చున్న యువతిని బెదిరించి కారులోకి లాక్కెళ్లిన యువకులు
  • రాత్రంతా కారులో తిప్పుతూ అత్యాచారం
  • నిందితులందరూ 24 ఏళ్లలోపు వారే
  • అందరినీ అరెస్ట్ చేసిన పోలీసులు
కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. పార్కులో మిత్రుడితో కూర్చున్న 19 ఏళ్ల యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకున్న నలుగురు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గత నెల 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని కోరమంగళ నేషనల్ గేమ్స్ పార్క్ వద్ద బాధిత యువతి తన స్నేహితుడితో కలిసి కూర్చుంది.

అదే సమయంలో అక్కడికొచ్చిన ఓ యువకుడు ఇంత రాత్రిపూట ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించాడు. ఆ విషయం నీకెందుకని, నీ పని నువ్వు చూసుకోవాలని వారు హెచ్చరించారు. దీంతో అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోయిన యువకుడు కాసేపటి తర్వాత మరో ముగ్గురు స్నేహితులతో కలిసి వచ్చి యువతి స్నేహితుడిని బెదిరించి ఆమెను బలవంతంగా కారులోకి ఈడ్చుకెళ్లారు. రాత్రంతా ఆమెను కారులో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో యువతిని ఆమె ఇంటి సమీపంలో వదిలి పరారయ్యారు. విషయం ఎవరితోనైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

అయితే, విషయాన్ని యువతి తన తల్లికి చెప్పడంతో ఆమె ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది. అనంతరం ఇద్దరూ కలిసి వెళ్లి కోరమంగళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు సతీశ్, విజయ్, శ్రీధర్, కిరణ్‌లను అరెస్ట్ చేశారు. వారి వయసు 22 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులందరూ ఒకే ప్రాంతానికి చెందిన వారని, వారిలో ఒకడు బాధితురాలి స్నేహితుడేనని పేర్కొన్నారు. నిందితుల్లో ఇద్దరు ఆఫీస్ బాయ్స్ కాగా, ఒకడు ఎలక్ట్రీషియన్ అని, మరో వ్యక్తి బీపీవోలో పనిచేస్తున్నట్టు చెప్పారు.


More Telugu News