బాలకృష్ణ అంచనా వేసిన స్కోరే సాధించిన చెన్నై సూపర్ కింగ్స్

  • ఐపీఎల్ లో కామెంటేటర్ గా బాలకృష్ణ
  • చెన్నై 170 పరుగులు సాధిస్తుందని అంచనా వేసిన వైనం
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసిన చెన్నై
  • 50 బంతుల్లో 92 పరుగులు చేసిన గైక్వాడ్
ఐపీఎల్ లో కామెంటేటర్ గానే కాదు, విశ్లేషకుడిగానూ నందమూరి బాలకృష్ణ తనదైన ముద్ర వేశారు. గుజరాత్ టైటాన్స్ తో ఐపీఎల్-16 ప్రారంభ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 170 పరుగుల వరకు స్కోరు సాధిస్తుందని బాలకృష్ణ అంచనా వేశారు. దాదాపు ఆయన చెప్పినట్టుగానే చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. 

దాంతో, మ్యాచ్ ముగియగానే స్టార్ స్పోర్ట్స్ మ్యాచ్ ప్రజెంటర్ వింధ్య విశాఖ ఈ విషయాన్ని బాలకృష్ణ వద్ద ప్రస్తావించింది. మీ అంచనా నిజమైంది సర్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అందుకు సమాధానంగా బాలయ్య నుంచి చిరునవ్వు వెలువడింది. 

ఇక, మ్యాచ్ విషయానికొస్తే... టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సూపర్ ఇన్నింగ్స్ హైలైట్ గా నిలిచింది. 

గైక్వాడ్ కేవలం 50 బంతుల్లోనే 4 ఫోర్లు, 9 సిక్సులతో 92 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. షార్ట్ పిచ్ బంతులనే కాదు, కొన్ని సార్లు లెంగ్త్ బంతులను కూడా గైక్వాడ్ స్టాండ్స్ లోకి పంపి చెన్నై అభిమానులను అలరించాడు. 

చెన్నై 14 పరుగుల స్కోరు వద్ద ఓపెనర్ డెవాన్ కాన్వే (1) వికెట్ కోల్పోయింది. అయితే గైక్వాడ్ విజృంభణతో చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ స్కోరు సాధ్యమైంది. మొయిన్ అలీ 23, రాయుడు 12, శివమ్ దూబే 19, ఆఖర్లో ధోనీ 14* (1 ఫోర్, 1 సిక్స్) పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహ్మద్ షమీ 2, రషీద్ ఖాన్ 2, అల్జారీ జోసెఫ్ 2, జోష్ లిటిల్ 1 వికెట్ తీశారు.


More Telugu News