బీజేపీ నేత సత్యకుమార్ పై దాడి ఘటన పట్ల ఏఎస్పీ అనిల్ కుమార్ స్పందన

  • బీజేపీ నేత సత్యకుమార్ పై అమరావతి ప్రాంతంలో దాడి
  • వైసీపీపై మండిపడుతున్న బీజేపీ నేతలు
  • పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలు
  • వివరణ ఇచ్చిన ఏఎస్పీ
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై రాజధాని అమరావతి ప్రాంతంలో దాడి జరగడం తెలిసిందే. వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడుతుంటే పోలీసులు పట్టించుకోలేదని సత్యకుమార్ సహా బీజేపీ నేతలు, విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఏఎస్పీ అనిల్ కుమార్ వివరణ ఇచ్చారు. దాడి జరిగిన వెంటనే సకాలంలో స్పందించామని స్పష్టం చేశారు. 

బందోబస్తులో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండడం వల్లే ఎలాంటి విపరీత పరిణామాలు చోటుచేసుకోలేదని ఏఎస్పీ అనిల్ కుమార్ వివరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా విధులు నిర్వహించామని తెలిపారు. బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడారని వెల్లడించారు. 

బీజేపీ నేతలు గుంటూరు వెళుతూ అనుకోకుండా సీడ్ యాక్సిస్ రోడ్డుపైకి రావడం వల్లే ఈ ఘటన జరిగిందని అన్నారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారని, ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలన్న అంశంపై న్యాయ సలహా తీసుకుంటామని ఏఎస్పీ చెప్పారు. 

అంతకుముందు, ఈ ఘటన నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థులపై భౌతిక దాడులే మీ దృష్టిలో ప్రజాస్వామ్యమా ముఖ్యమంత్రి జగన్ గారూ అంటూ ప్రశ్నించారు. 

"అసెంబ్లీ సాక్షిగా అమరావతే రాష్ట్ర రాజధాని అని మీరు చెప్పిన మాటనే మా జాతీయ కార్యదర్శి సత్యమూర్తి గుర్తుచేస్తే ఈ పద్ధతిలో దాడులకు పాల్పడడం దిగజారుడు రాజకీయం కాదా? ఈ ఘటనకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అమరావతి రైతులకు సంఘీభావం తెలియజేస్తే తప్పేంటి? జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను... దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నాను" అంటూ సోము వీర్రాజు ట్వీట్ చేశారు.


More Telugu News