ఐపీఎల్ లో దబిడిదుబిడే... కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య

  • బాలకృష్ణ కొత్త అవతారం
  • ఐపీఎల్ మ్యాచ్ లకు క్రికెట్ వ్యాఖ్యాతగా బాలకృష్ణ
  • స్టార్ స్పోర్ట్స్ చానల్ తో ఒప్పందం
  • జై బాలయ్య అంటూ స్వాగతం పలికిన ఇతర వ్యాఖ్యాతలు
టాలీవుడ్ అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొత్త అవతారం ఎత్తారు. ఇవాళ ప్రారంభమయ్యే ఐపీఎల్ 16వ సీజన్ ద్వారా బాలయ్య క్రికెట్ కామెంటేటర్ గా పరిచయం కానున్నారు. 

నేడు ఐపీఎల్ తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ తో ఐపీఎల్-2023కి తెరలేవనుండగా, బాలయ్య స్టార్ స్పోర్ట్స్ కామెంట్రీ బృందంతో జత కలిశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. తనదైన శైలిలో చమక్కులతో మిగతా కామెంటేటర్లను కూడా నవ్వించారు. జై బాలయ్య అంటూ హోస్ట్ నందూ, ఇతర కామెంటేటర్లు ఆశిష్ రెడ్డి, కల్యాణ్ కృష్ణ తదితరులు బాలకృష్ణకు స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, తాను స్కూల్ రోజుల్లో క్రికెట్ ఆడేవాడ్నని, కాలేజీ రోజుల్లో తనకు అజహరుద్దీన్, కిరణ్ కుమార్ రెడ్డి (మాజీ సీఎం) వంటి మేటి క్రికెటర్లతో పరిచయం కలిగిందని వెల్లడించారు. ఆ తర్వాత స్టూడియోలోకి ఎమ్మెస్కే ప్రసాద్, వేణుగోపాల్ రావు కూడా ఎంట్రీ ఇచ్చారు. బాలయ్య వచ్చాడు... ఇవాళ దబిడిదుబిడే అంటూ ఇతర కామెంటేటర్లు ఉత్సాహం వ్యక్తం చేశారు. ఈ ఐపీఎల్ లో తన ఓటు సన్ రైజర్స్ కే అని బాలకృష్ణ స్పష్టం చేశారు. 

ఇక, భువనేశ్వర్ కుమార్, అదిల్ రషీద్, హ్యారీ బ్రూక్, ఉమ్రాన్ మాలిక్ వంటి సన్ రైజర్స్ ఆటగాళ్లను, సన్ రైజర్స్ హెడ్ కోచ్ బ్రియాన్ లారాలకు బాలయ్య డైలాగును పలికే చాలెంజ్ విసిరారు. అయితే, ఆ ఆటగాళ్లు... బాలకృష్ణ సినీ డైలాగులు పలికేందుకు ఆపసోపాలు పడ్డారు. 

ఫ్లూటు జింకపిల్ల ముందు ఊదు... సింహం ముందు కాదు అనే డైలాగును భువనేశ్వర్ అతి కష్టమ్మీద పలకగా, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనే డైలాగును పలికేందుకు మిగతా క్రికెటర్లు ఎంతో శ్రమించారు. ఇక ఉమ్రాన్ మాలిక్ దబిడిదుబిడే అంటూ పలికి ఊపిరి పీల్చుకున్నాడు. లారా కొంచెం సులువుగానే డైలాగ్ చెప్పాడు. కాగా, బ్రియాన్ లారా ఆటను తాను ఎంతగానో ఇష్టపడతానని బాలయ్య ఇతర కామెంటర్లకు వివరించారు. 

ఇక, వేణుగోపాల్ రావు తొడ కొట్టే ప్రయత్నం చేయగా బాలయ్య తనదైన శైలిలో స్పందించారు. మేం స్టేజిపై తొడ కొట్టీ కొట్టీ కమిలిపోయింది... నువ్వు కొట్టొద్దులే, ఎందుకొచ్చిన బాధ అంటూ చమత్కరించారు. 

అంతేకాదు, ధోనీ గురించిన ఓ క్విజ్ లో ఒక ప్రశ్న తప్పు అడిగారంటూ బాలయ్య తన స్పోర్ట్ నాలెడ్జ్ ను చాటుకున్నారు. ధోనీ స్కూల్ రోజుల్లో తొలుత పాఠశాల హాకీ టీమ్ కు గోల్ కీపర్ అన్నది ఆ స్టేట్ మెంట్ సారాంశం. అందుకు బాలకృష్ణ వెంటనే అందుకున్నారు. ధోనీ బాల్యంలో తన స్కూల్ లో గోల్ కీపర్ గా వ్యవహరించింది హాకీ టీమ్ కు కాదని, ఫుట్ బాల్ టీమ్ గోల్ కీపర్ అని కరెక్ట్ చేశారు. దాంతో ఇతర కామెంటేటర్లు బాలకృష్ణ క్రీడా పరిజ్ఞానాన్ని కొనియాడారు.


More Telugu News