మోదీ సర్టిఫికెట్ల అంశంలో కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు జరిమానా

  • ప్రధాని మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను చూపాలంటూ కేజ్రీవాల్ పిటిషన్
  • కేజ్రీవాల్ కు మొట్టికాయలు వేసిన కోర్టు
  • ఇందులో ప్రజాప్రయోజనం ఏముందని ప్రశ్నించిన వైనం
  • కేజ్రీవాల్ కు రూ.25 వేల జరిమానా
ప్రధాని నరేంద్ర మోదీ తన డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను చూపించాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. 

ప్రధాని మోదీ సర్టిఫికెట్ల అంశం ప్రజలకు సంబంధించిన విషయమా? అంటూ గుజరాత్ హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఈ పిటిషన్ వేసిన కేజ్రీవాల్ కు రూ.25 వేల జరిమానా విధించింది. మోదీ సర్టిఫికెట్లను చూపించాల్సిన అవసరం పీఎంవోకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ బీరేన్ వైష్ణవ్ తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువరించింది. 

మోదీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విదార్హతల వివరాలు ఇవ్వాలంటూ పీఎంవో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (పీఐఓ), గుజరాత్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీల పీఐఓలకు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ జారీ చేసిన ఆదేశాలను కూడా న్యాయస్థానం కొట్టివేసింది. 

చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ గుజరాత్ యూనివర్సిటీ దాఖలు చేసిన పిటిషన్ ను గుజరాత్ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ కు జరిమానా విధించిన న్యాయస్థానం, ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

"ఇది ప్రజాస్వామ్యం. ఒక వ్యక్తి పదవి చేపడితే అతడు డాక్టరేట్ చేశాడా, లేక నిరక్షరాస్యుడా అనే తేడాలు ఉండరాదు. అయినా ఆ వ్యక్తి గోప్యతకు భంగం కలిగించడం తప్ప ఇందులో ప్రజా ప్రయోజనం ఏముంది?" అంటూ కోర్టు పేర్కొంది. 

కాగా, గుజరాత్ యూనివర్సిటీ తరఫున కోర్టులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ గతంలో సమర్పించిన వివరాల ప్రకారం... గుజరాత్ యూనివర్సిటీ నుంచి 1978లో డిగ్రీ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. 

వాదనల సందర్భంగా కేజ్రీవాల్ తరఫు న్యాయవాది స్పందిస్తూ... ఎన్నికల సందర్భంగా సమర్పించిన నామినేషన్ ఫారంలో మోదీ విద్యార్హతలను పేర్కొన్నారని వెల్లడించారు. అందుకే తాము ఆయన డిగ్రీ సర్టిఫికెట్ ను అడుగుతున్నామని, మార్కుల జాబితాలను కాదని స్పష్టం చేశారు.


More Telugu News