అన్నయ్య మరణం నాకు నేర్పిన పాఠం: మ్యూజిక్ డైరెక్టర్ చక్రి తమ్ముడు మహిత్ !

  • చక్రి గురించి ప్రస్తావించిన మహిత్ 
  • అన్నయ్య మనసులోని మాటను గురించిన ప్రస్తావన 
  • ఆయన వారసుడిగా నిలబడతానని వ్యాఖ్య 
  • ఆయన మరణంతో చాలామంది మారిపోయారని వెల్లడి

మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ప్రతిభ .. ఆయన మరణం తరువాత వచ్చిన వార్తలను గురించి తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో చక్రి తమ్ముడు మహిత్ మాట్లాడుతూ .. "మ్యూజిక్ డైరెక్టర్ గా ఇప్పుడు నేను చేస్తున్న పనికి గురువు మా అన్నయ్యే. తనతోపాటు ఉంటూ తను చెప్పిన పని చేస్తూ వెళ్లడం వలన, నాకు ఈ పని తెలిసింది. నేను అన్నయ్య వారసుడిగా సాగాలనేది ఆయన కోరికనే" అని చెప్పాడు.

''అన్నయ్య చనిపోయిన తరువాత నేను బ్రతకగలనా అనిపించింది. కానీ తన వారసుడిగా నిలబడాలనే అన్నయ్య కలను నిజం చేయవలసిన బాధ్యత నాపైనే ఉంది. అందువల్లనే అన్నిటినీ తట్టుకుని నిలబడాలనే ఒక బలమైన నిర్ణయానికి వచ్చాను. అదే మార్గంలో ముందుకు వెళ్లాలనే తపనతో అడుగు ముందుకు వేశాను" అని అన్నాడు. 

"అన్నయ్య చాలామందితో చాలా కలుపుగోలుగా ఉండేవాడు. నేను ఎవరితోనూ ర్యాపో పెంచుకోకుండా అన్నయ్య చెప్పిన పనులు చేస్తూ వెళ్లేవాడిని. అన్నయ్య పోయిన తరువాత ఆయనతో సాన్నిహిత్యంగా ఉంటూ వచ్చినవారే, పక్కకి వెళ్లి మా గురించి వేరే రకంగా మాట్లాడటం చూసి తట్టుకోలేకపోయాను. ఆయన మరణం నాకు ఒక పాఠం నేర్పింది. అప్పటి నుంచి మరింత మొండిగా బ్రతకడం మొదలెట్టాను" అని చెప్పుకొచ్చాడు.



More Telugu News