ట్రంప్ జైలుకెళితే 2024 ఎన్నికల్లో పోటీ చేయొచ్చా?

  • హుష్ మనీ కేసులో మాజీ అధ్యక్షుడిపై కేసు నమోదు
  • అరెస్టు తప్పదని అమెరికాలో ప్రచారం
  • ట్రంప్ రాజకీయ భవిష్యత్తుపై ఆయన మద్దతుదారుల ఆందోళన
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు తప్పదని ప్రచారం జరుగుతోంది. హుష్ మనీ కేసులో ఇప్పటికే ఆయనపై కేసు నమోదైందని, ఈ కేసులో రేపో మాపో ట్రంప్ ను పోలీసులు అరెస్టు చేస్తారని వార్తలు వెలువడుతున్నాయి. అమెరికా చరిత్రలోనే క్రిమినల్ చార్జ్ ఎదుర్కొంటున్నమాజీ అధ్యక్షుడిగా ట్రంప్ చెత్త రికార్డును మూటకట్టుకున్నాడు. ఒకవేళ ట్రంప్ జైలుకెళ్లాల్సి వస్తే ఆయన రాజకీయ భవిష్యత్తు శూన్యంగా మారనుందా.. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాల్సిందేనా?.. తదితర ప్రశ్నలు ట్రంప్ అభిమానులను వేధిస్తున్నాయి.

ట్రంప్ అరెస్టయితే ఏం జరుగుతుంది ?
అరెస్టు, జైలు శిక్ష వల్ల ట్రంప్ రాజకీయ భవిష్యత్తుకు వచ్చిన ముప్పేమీ లేదు. పైపెచ్చు ప్రజల్లో సానుభూతి పెరిగేందుకు తోడ్పడే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడనే నిబంధన ఏమీ లేదు.. అంటే, 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ బరిలోనే ఉంటారు. జైలు శిక్ష పడినా సరే ట్రంప్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాల్సిన అవసరంలేదని నిపుణులు తెలిపారు.

జైలులో నుంచి కూడా అధ్యక్ష బాధ్యతలను నిర్వహించవచ్చని చెబుతున్నారు. ఈ విషయంలో అమెరికా రాజ్యాంగంలో ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు. అంటే.. నేరారోపణలు ఎదుర్కొంటున్న, జైలు జీవితం గడిపిన వారు అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే నిబంధన ఏదీ రాజ్యాంగంలో లేదని వివరించారు.

అరెస్టు ఎలా జరగొచ్చంటే..
అమెరికాలో మాజీ అధ్యక్షుడి అరెస్టు సమయంలో పాటించే ప్రోటోకాల్ ప్రకారం.. ఫ్లోరిడాలోని తన ఇంటి నుంచి ట్రంప్‌ న్యూయార్క్ సిటీ కోర్టుకు రావాల్సి ఉంటుంది. అక్కడే అధికారులు ట్రంప్ ఫోటోలు, వేలిముద్రలు తీసుకుంటారు. ఒకవేళ ట్రంప్ గోప్యతను కాపాడాలనుకుంటే మీడియా కంటబడకుండా ప్రైవేటు మార్గంలో కోర్టుకు తరలించే అవకాశం ఉంది.


More Telugu News