బలగం చిత్రానికి రెండు అంతర్జాతీయ అవార్డులు

  • లాస్ ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు చిత్రం
  • బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ సినిమాటోగ్రఫీ అవార్డులు కైవసం
  • చిన్న చిత్రంగా వచ్చి అద్భుత విజయం అందుకున్న బలగం
కమెడియన్ వేణు దర్శకుడిగా మారి రూపొందించిన తొలి చిత్రం బలగం. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన చిత్రం అద్భుత విజయం సాధించింది. తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి పచ్చదనాన్ని, మానవ బంధాలను వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పల్లెటూరి ప్రజలను ఎంతగానో మెప్పించిన చిత్రం ఇటీవలే ఓటీటీలో విడుదలై అక్కడా ఎంతో ఆదరణ దక్కించుకుంది.

ఈ చిత్రానికి ప్రశంసలతోపాటు అవార్డులూ వస్తున్నాయి. తాజాగా రెండు అంతర్జాతీయ అవార్డులు చిత్రాన్ని వరించాయి. లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డుల్లో బలగం సత్తా చాటింది. బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో రెండు అవార్డులను గెలుచుకుంది.

ఈ విషయాన్ని దర్శకుడు వేణు స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. ‘నా బలగం సినిమాకు ఇది మూడో అవార్డు. ప్రపంచ వేదికపై బలగం మెరిస్తుంది. ప్రతిష్టాత్మక లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫి అవార్డును గెలుచుకున్నందుకు మా సినిమాటోగ్రాఫర్‌ ఆచార్య వేణుకు అభినందనలు’ అని ట్విట్టర్‌లో ఫోటోలు పంచుకున్నాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్‌ రెడ్డి, హన్షితా రెడ్డి నిర్మించారు. రెండు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.20 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్‌ చేసింది.


More Telugu News