ఏపీలో భిన్నమైన వాతావరణం.. ఓవైపు ఠారెత్తిస్తున్న ఎండలు.. మరోవైపు వర్షం!

  • ఉదయం 8 గంటలకే మొదలవుతున్న ఎండ తీవ్రత
  • నిన్న అత్యధికంగా రేణుగుంటలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 2 సెంటీమీటర్లకుపైనే కురుస్తున్న వర్షం
  • నేడు, రేపు కూడా వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ
ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఓ వైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు అకాల వర్షాలు రైతులను కష్టాల్లోకి నెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితే ఉంది. ఉదయం 8 గంటలకే ఎండతీవ్రత మొదలవుతోంది. ఆపై 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. 

ఇంకోవైపు, ఈ నెల 18 నుంచి మొదలైన అకాల వర్షాలు ఇంకా అక్కడక్కడా కురుస్తూనే ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల 2 సెంటీమీటర్లకుపైగానే వర్షపాతం నమోదవుతోంది. నేడు, రేపు కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే, రాయలసీమలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. 

రేణిగుంటలో నిన్న అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, శ్రీపొట్టిశ్రీరాములు జిల్లా కందుకూరులో 40.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే, నిన్న అన్నమయ్య, చిత్తూరు, విశాఖపట్టణం, నంద్యాల, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.


More Telugu News