కర్ణాటకలో బీజేపీని గెలిపించేందుకు జగన్ తన అక్రమాస్తులను ఖర్చు చేయబోతున్నారు: సీపీఐ నారాయణ

  • వివేకా హత్యకేసు నుంచి బయటపడేందుకు అమిత్ షాతో జగన్ ఒప్పందం చేసుకున్నారని ఆరోపణ
  • వివేకా హత్యకేసులో తీర్పు ఆలస్యమయ్యే అవకాశం ఉందని వ్యాఖ్య
  • రాష్ట్రాన్ని జగన్ శ్మశానంగాలా మారుస్తారని ఫైర్
  • రాహుల్ విషయంలో కేంద్రం వైఖరిపై నారాయణ ఆగ్రహం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సీపీఐ నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్యకేసు నుంచి బయటపడేందుకు కేంద్రమంత్రి అమిత్ షాతో జగన్‌ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. అందులో భాగంగా కర్ణాటకలో బీజేపీని గెలిపించే బాధ్యతను నెత్తిన వేసుకున్నారని, అందుకోసం తన అక్రమ సంపాదనను ఖర్చుచేయబోతున్నారని అన్నారు. తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీతో జగన్ చేసుకున్న రాజకీయ ఒప్పందం కారణంగా వివేకా హత్య కేసులో తీర్పు ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు. జగన్ పదేపదే ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారన్న విషయం మొత్తానికి బయటపడిందన్నారు. వివేకా హత్యకేసు విచారణ తుదిదశకు చేరుకోవడంతో భయంతోనే జగన్ ఢిల్లీ వెళ్లారని అన్నారు. 

కేంద్రాన్ని నిలదీయలేకపోతున్న జగన్ రాష్ట్రాన్ని శ్మశానంలా మారుస్తున్నారని మండిపడ్డారు. ఇక, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌పై కేంద్రం కక్షతో వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ అన్ని పార్టీలతో కలిసి త్వరలోనే ఉద్యమం చేపడతామని చెప్పుకొచ్చారు.


More Telugu News