ఎండలు మండిపోతున్నా.. పిల్లలకు ఒంటిపూట బడులు ఎందుకు పెట్టడం లేదు?: జగన్ కు అనగాని లేఖ

  • ఉపాధ్యాయులను సాధించడానికి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న అనగాని
  • ఒంటిపూట బడులు అడిగిన ఉపాధ్యాయులపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేయడం సిగ్గుచేటని వ్యాఖ్య
  • రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని మండిపాటు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నా... పిల్లలకు ఒంటిపూట బడులు ఎందుకు పెట్టడం లేదని లేఖలో సీఎంను ఆయన ప్రశ్నించారు. ఉపాధ్యాయులపై కక్ష సాధించడానికి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఒండిపూట బడులు నిర్వహించడం ఈరోజు కొత్తగా వచ్చిన విధానం కాదని... మార్చి మొదటి లేదా రెండో వారంలో ఒంటిపూట బడులు పెట్టడం దశాబ్దాలుగా అమలవుతోందని చెప్పారు. ఒంటిపూట బడులు పెట్టాలని అడిగిన ఉపాధ్యాయులపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేయడం సిగ్గుచేటు అని అన్నారు. 

తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని అనగాని విమర్శించారు. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు తుపాను కారణంగా పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తు నిధిని ఏర్పాటు చేస్తామన్న మీ హామీ ఏమయిందని ప్రశ్నించారు. 175కి 175 సీట్లు గెలుస్తామని చెప్పుకోవడం మానేసి... కనీసం 175 మంది రైతులనైనా ఆదుకోవాలని ఎద్దేవా చేశారు.


More Telugu News