ఐపీఎల్ లో మారిన రూల్స్​.. సరికొత్తగా మార్చనున్న ఇంపాక్ట్ ప్లేయర్

  • 16వ సీజన్ కోసం నిబంధనల్లో మార్పులు చేసిన బీసీసీఐ
  • కొత్తగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అమల్లోకి
  • రేపటి నుంచి మెగా లీగ్
2008లో మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ అత్యంత ప్రజాదరణ దక్కించుకొని ప్రపంచ క్రికెట్‌ గతినే మార్చేసింది. ఈ 16 ఏళ్లలో క్రికెట్‌ ఆడే విధానంలో, ముఖ్యంగా టీ20ల్లో అనేక మార్పులకు నాందిగా మారింది. శుక్రవారం మొదలయ్యే ఐపీఎల్‌16వ సీజన్‌ మరో సరికొత్త ఆవిష్కరణకు వేదిక కానుంది. ఈ సీజన్‌లో ప్రవేశ పెడుతున్న ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అనే రూల్ ఐపీఎల్ ను సరికొత్తగా మార్చనుంది. దీంతో పాటు ఈ సీజన్ కోసం బీసీసీఐ పలు రూల్స్ లో మార్పులు చేసింది. అవేంటో చూద్దాం..

ఇంపాక్ట్ ప్లేయర్ అంటే?
ఫుట్ బాల్ మాదిరిగా  మ్యాచ్‌ మధ్యలో ఓ ఆటగాడి స్థానంలో మరొకరిని బరిలోకి దింపి బ్యాటింగ్‌, బౌలింగ్‌ అవకాశం కల్పించడమే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సబ్‌స్టిట్యూట్‌ రూల్‌.  టీ20లను మరింత రసవత్తరంగా మార్చి, ఆటకు ఆదరణ పెంచేందుకు ఐపీఎల్‌లో బీసీసీఐ దీన్ని రూపొందించింది. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఇప్పటికే విజయవంతంగా పరీక్షించింది. ఇందు కోసం మ్యాచ్‌కు ముందు ఇరు జట్లూ 11 మంది ఆటగాళ్లతో  పాటు నలుగురు సబ్‌స్టిట్యూట్‌ ఆటగాళ్ల పేర్లు ఇవ్వాలి.  

టాస్ పడిన తర్వాత మ్యాచ్‌లో పరిస్థితికి తగ్గట్టుగా తుదిజట్టులోని ఒక ఆటగాడిని తప్పించి అతని స్థానంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను బరిలోకి దింపొచ్చు. ఉదాహరణకు బౌలింగ్‌ చేస్తున్న జట్టు తమకు లెగ్‌ స్పిన్నర్‌ అవసరం అనుకుంటే ముందుగా పేర్లు ఇచ్చిన నలుగురు సబ్స్టిట్యూట్ ఆటగాళ్ల నుంచి అలాంటి ప్లేయర్‌ను తీసుకోవచ్చు. లక్ష్య ఛేదనకు దిగిన జట్టు తమకు అదనపు బ్యాటర్‌ కావాలనుకుంటే ఓ బౌలర్ ను తప్పించి సబ్‌స్టిట్యూట్‌ చేసుకోవచ్చు. 

ఓవర్‌ పూర్తయినప్పుడు, వికెట్‌ పడినప్పుడు, బ్యాటర్‌ రిటైర్‌ అయిన సందర్భాల్లోనే ఇంపాక్ట్‌ ప్లేయర్‌  గ్రౌండ్ లోకి వస్తాడు. వర్షం, ఇతర కారణాలతో పది కంటే తక్కువ ఓవర్లకు దించిన మ్యాచ్ ల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వర్తించదు. ఒకసారి ఇంపాక్ట్‌ ప్లేయర్‌ కోసం బయటికి వెళ్లిన ఆటగాడిని తిరిగి తుది జట్టులోకి అనుమతించరు. ఇంపాక్ట్ ప్లేయర్ బౌలర్ గా వస్తే అతను నాలుగు ఓవర్ల పూర్తి కోటా బౌలింగ్ చేయవచ్చు. తుది జట్టులో ముగ్గురు, అంతకంటే తక్కువ మంది విదేశీ ఆటగాళ్లు ఉంటే తప్ప ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా భారత ఆటగాడినే తీసుకోవాలి.

టాస్ తర్వాత తుది జట్టు
టీ20ల్లో టాస్‌  ప్రభావాన్ని తగ్గించేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టాస్‌ తర్వాతే తుది జట్టును ప్రకటించే అవకాశాన్ని ఈసారి నుంచి కల్పిస్తోంది. ఇరు జట్ల కెప్టెన్లు రెండు టీమ్‌ షీట్స్‌తో టాస్‌కు వెళ్లనున్నారు. టాస్‌ ఫలితాన్ని బట్టి ఏ జట్టుతో ఆడాలో నిర్ణయించుకుంటారు. 

వైడ్, నో బాల్స్ కు డీఆర్‌ఎస్‌
ఇప్పటిదాకా బ్యాటర్‌ ఔట్‌, నాటౌట్‌ విషయాల్లో అంపైర్ల నిర్ణయాన్ని సవాల్‌ చేసేందుకు ఇరు జట్లకు ఇన్నింగ్స్ లో ఒక్కో డీఆర్‌ఎస్‌ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వైడ్‌, హైట్‌ నోబాల్స్‌కూ డీఆర్‌ఎస్‌ కోరవచ్చు. 

కదిలితే జరిమానా
బౌలర్‌ బంతిని వేసేటప్పుడు బ్యాటర్‌ ఏకాగ్రత దెబ్బతీసేలా ఫీల్డర్‌, వికెట్‌ కీపర్‌ దురుద్దేశపూర్వంగా కదిలినట్టు అంపైర్‌ గుర్తిస్తే  ఫీల్డింగ్‌ జట్టుకు ఐదు రన్స్‌ జరిమానా విధిస్తాడు. 

స్లో ఓవర్ రేట్
ఇన్నింగ్స్‌ నిర్ణీత సమయంలో పూర్తయ్యేందుకు బీసీసీఐ చొరవ తీసుకుంటోంది. బౌలింగ్‌ చేసే జట్టు టైమ్ ఔట్స్ తో కలిపి నిర్ణీత 90 నిమిషాల్లో 20 ఓవర్లు పూర్తి చేయాలి. లేదంటే 90 నిమిషాలు దాటిన తర్వాత మిగిలిన ఓవర్లలో 30 గజాల సర్కిల్‌ బయట ఐదుగురికి బదులు నలుగురు ఫీల్డర్లనే అనుమతిస్తారు. ఇది బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలం అవుతుంది.


More Telugu News