భద్రాద్రి రామయ్య కల్యాణానికి ఈసారి కూడా కేసీఆర్ గైర్హాజరు!

  • 2016లో చివరిసారి భద్రాద్రి రామయ్య కల్యాణానికి హాజరైన సీఎం కేసీఆర్
  • అదే ఏడాది ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్ల ప్రకటన
  • ఆ తర్వాతి నుంచీ భద్రాద్రికి రాని కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి కూడా భద్రాద్రి రామయ్య కల్యాణానికి గైర్హాజరయ్యారు. 2016లో చివరిసారి రామయ్య కల్యాణానికి సీఎం హాజరయ్యారు. ఆ తర్వాతి నుంచి భద్రాద్రి ముఖమే చూడడం మానేశారు. భక్త రామదాసు (కంచర్ల గోపన్న) భద్రాద్రిలో ఆలయాన్ని నిర్మించినప్పటి నుంచీ సీతారాముల కల్యాణానికి పాలకులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అది నేటికీ కొనసాగుతోంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కొంతకాలంపాటు ఈ ఆచారానికి బ్రేక్ పడింది.

అయితే, 1972లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళ్రావు ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించారు. ఆ తర్వాతి నుంచి రాముల వారి కల్యాణానికి ముఖ్యమంత్రులే పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2015, 2016లో ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి రామయ్య కల్యాణానికి హాజరయ్యారు. 

2016లో ఆలయ పునర్నిర్మాణానికి సీఎం రూ. 100 కోట్లు ప్రకటించారు. అయితే, ఆ తర్వాతి నుంచి భద్రాద్రి వేడుకులకు సీఎం గైర్హాజరవుతూ వస్తున్నారు. కాగా, సీతారాముల కల్యాణం తర్వాతి రోజున పట్టాభిషేకం జరిపించడం 2003 నుంచి ఆనవాయితీగా మారింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.


More Telugu News