ఐపీఎల్ లో కామెంటేటర్ అవతారం ఎత్తనున్న స్టీవ్ స్మిత్

  • మరో రెండ్రోజుల్లో ఐపీఎల్ 16వ సీజన్
  • స్టార్ స్పోర్ట్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న స్టీవ్ స్మిత్
  • స్టార్ స్పోర్ట్స్ ఎక్స్ పర్ట్స్ ప్యానెల్లో స్మిత్ కు చోటు
  • తాను క్రికెట్ ను చక్కగా విశ్లేషించగలనన్న స్మిత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ మార్చి 31న ప్రారంభం కానుంది. క్రికెట్ వినోదానికి కేరాఫ్ అడ్రెస్ లా నిలిచే ఐపీఎల్ ఆటగాళ్లకే కాదు మాజీ ఆటగాళ్లకు కూడా ఉపాధి కేంద్రంలా మారింది. పలు దేశాలకు చెందిన మాజీలు ఐపీఎల్ జట్లకు కోచ్ లు గానూ, సలహాదారులుగానూ వ్యవహరిస్తున్నారు. మరికొందరు క్రికెట్ కామెంటేటర్లుగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ కూడా ఐపీఎల్ లో కామెంటేటర్ అవతారం ఎత్తనున్నాడు. 

మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ తాజా సీజన్ లో తన వ్యాఖ్యానంతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు టోర్నీ అధికారిక ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ తో స్టీవ్ స్మిత్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఐపీఎల్-2023 కోసం స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ నిపుణుల ప్యానెల్లో తాను కూడా భాగం అయ్యానని స్మిత్ వెల్లడించాడు. 

కామెంటేటర్ గా సరికొత్త పాత్రలోకి ప్రవేశిస్తున్నానని వెల్లడించాడు. ఆటను బాగానే అర్థం చేసుకోగలనని, విశ్లేషించగలనని తెలిపాడు. ఐపీఎల్ లో స్టార్ స్పోర్ట్స్ బృందంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఈ ఆసీస్ మాజీ సారథి పేర్కొన్నాడు. 

ఐపీఎల్ లో అనేక జట్లకు ప్రాతినిధ్యం వహించి, కెప్టెన్ గానూ వ్యవహరించిన స్టీవ్ స్మిత్ ను ఈ సీజన్ కోసం వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు.


More Telugu News