ఏప్రిల్ 30 లోపు వివేకా హత్య కేసు దర్యాప్తు ముగించాలి: సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు

  • సీబీఐకి డెడ్ లైన్ విధించిన సుప్రీంకోర్టు
  • వివేకా హత్య కేసులో కుట్ర కోణాన్ని అత్యంత వేగంగా బయటపెట్టాలని ఆదేశాలు
  • సీబీఐ నివేదికను పరిగణనలోకి తీసుకున్నట్టు వెల్లడి
  • వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారి రామ్ సింగ్ ను తప్పించినట్టు సీబీఐ వెల్లడి
  • డీఐజీ చౌరాసియా నేతృత్వంలో కొత్త సిట్
  • శివశంకర్ రెడ్డికి బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
  •  తులశమ్మ పిటిషన్ తిరస్కరణ
వివేకా హత్య కేసుకు సంబంధించి పలు అంశాలపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పలు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 30వ తేదీ లోపు వివేకా హత్య కేసు దర్యాప్తు ముగించాలని సీబీఐకి డెడ్ లైన్ విధించింది. విస్తృత కుట్ర కోణాన్ని అత్యంత వేగంగా బయటపెట్టాలని స్పష్టం చేసింది. గతంలో ఇదే కోర్టు వేగంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించిందని సుప్రీం ధర్మాసనం గుర్తు చేసింది. 

సీబీఐ దాఖలు చేసిన నివేదికను పరిగణనలోకి తీసుకున్నట్టు అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. వివేకా హత్య కేసు దర్యాప్తులో కొత్త సిట్ ను ఏర్పాటు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టు ముందు ప్రతిపాదనలు ఉంచింది. 

సీబీఐ డీఐజీ కేఆర్ చౌరాసియా నేతృత్వంలోని కొత్త సిట్ లో ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముఖేశ్ కుమార్, ఇన్ స్పెక్టర్లు ఎస్.శ్రీమతి, నవీన్ పునియా, సబ్ ఇన్ స్పెక్టర్ అంకిత్ యాదవ్ ఉంటారని ఈ ప్రతిపాదనల్లో పేర్కొంది. వివేకా హత్య కేసు దర్యాప్తు నుంచి ప్రస్తుత విచారణ అధికారి రామ్ సింగ్ ను తప్పించినట్టు కోర్టుకు తెలిపింది. 

ఇక, వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని ఆయన భార్య తులశమ్మ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఆరు నెలల్లోపు ట్రయల్ మొదలు కాకపోతే సాధారణ బెయిల్ పిటిషన్ కు అవకాశం ఉంటుందని, అప్పుడు సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని న్యాయస్థానం సూచించింది. 

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రభావం బెయిల్ పిటిషన్ పై ఉండబోదని, అర్హతలను బట్టే బెయిల్ పై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది.


More Telugu News