మ్యాచ్ ఫినిషర్ గా అతడికి ఎవరూ సాటి రారు: రియాన్ పరాగ్

  • మ్యాచ్ ను ముగించడంలో ధోనీ మాస్టరేట్ అన్న పరాగ్
  • తాను ఫినిషర్ గా వెళ్లే సందర్భంలో అతడినే గుర్తు చేసుకుంటానని వెల్లడి
  • రాజస్థాన్ జట్టు కోరితే ఏ క్రమంలో అయినా ఆడతానని స్పష్టీకరణ
మహేంద్ర సింగ్ ధోనీ భారత్ దేశం గర్వించే గొప్ప క్రికెటర్లలో ఒకడు. భారత్ కు వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, ఆసియా కప్ తెచ్చి పెట్టిన సారథి. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికినప్పటికీ.. 41 ఏళ్ల ఈ ఝార్ఖండ్ వికెట్ కీపర్, చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా కొనసాగుతూనే ఉన్నాడు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేసే జట్లలో చెన్నైపైనా అంచనాలు నెలకొన్నాయి.

ఈ తరుణంలో ధోనీ గురించి రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైట్ బాల్ క్రికెట్ లో మ్యాచ్ ఫినిషర్ గా ధోనీకి మరెవరూ సాటి రారని పరాగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘‘నేను గడిచిన మూడేళ్లుగా మ్యాచ్ ఫినిషింగ్ పాత్రను పోషిస్తున్నాను. ఈ సందర్భంగా నాకొక పేరు గుర్తుకు వస్తుంటుంది. అదే ఎంఎస్ ధోనీ. మరెవరూ ఆ కళలో (ఫినిషర్ గా) ప్రావీణ్యం సంపాదించారని నేను అనుకోను. ఫినిషర్ గా వెళ్లే ప్రతి సందర్భంలోనూ నేను ధోనీనే గుర్తు చేసుకుంటాను. మ్యాచ్ లను అతడు ఎలా ముగిస్తాడో స్మరణకు తెచ్చుకుంటాను’’ అని పరాగ్ ఓ వార్తా సంస్థతో పేర్కొన్నాడు. 

రాజస్థాన్ జట్టు తనను ఎప్పుడు బ్యాట్ చేస్తావని అడిగితే, నాలుగో స్థానంగా చెబుతానని పరాగ్ పేర్కొన్నాడు. జట్టు కోరితే ఏ క్రమంలో అయినా ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు.


More Telugu News