ధోనీ మోకాలికి గాయం అయిందా?

  • ప్రాక్టీస్ లో ఇబ్బంది పడ్డ ధోనీ
  • మోకాలికి క్యాప్ ధరించి బ్యాటింగ్
  • ఎక్కువగా రన్నింగ్ చేయలేకపోయిన మహీ
ఈ ఐపీఎల్ తో కెరీర్ ను ముగించాలని దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ భావిస్తున్నాడు. చెన్నై అభిమానుల సమక్షంలో చివరి ఆటలో అదరగొట్టాలని చూస్తున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ను మరోసారి విజేతగా నిలిపి ఘన వీడ్కోలు పలకాలని ఆశిస్తున్నాడు. ఈ క్రమంలో నెల రోజుల నుంచి చెన్నై చిదంబరం స్టేడియంలో ధోనీతో పాటు సీఎస్కే ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఇక ప్రాక్టీస్ చూసేందుకు సోమవారం సాయంత్రం స్టేడియంలోకి అభిమానులను అనుమతించారు. దాంతో, అభిమానులతో స్టేడియం కిక్కిరిసింది. ప్రాక్టీస్ పోరులో తనదైన శైలిలో సిక్సర్లు కొట్టిన ధోనీని చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కానీ, అదే సయమంలో మహీ ఎడమ కాలి నొప్పితో ఇబ్బందిపడ్డాడు. మోకాలి క్యాప్ ధరించిన అతను కాలుపై ఎక్కువ ఒత్తిడి పడకుండా చూసుకున్నాడు. ఎక్కువ రన్నింగ్ చేయలేకపోయాడు. 

దీన్ని బట్టి మహీ మోకాలికి గాయం అయిందని తెలుస్తోంది. ఇది అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. చాన్నాళ్ల నుంచి ఆటకు దూరంగా ఉన్న మహీ కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. దాంతో, మ్యాచ్ ఫిట్ నెస్ సాధించడం అతనికి సవాల్ గా మారింది. గాయంపై ఇప్పటివరకు పెద్దగా ఆందోళన లేకపోయినా.. ఒకవేళ తీవ్రంగా మారితే ఎలా అన్న దానిపై కూడా చర్చ మొదలైంది. గాయం వల్ల కొన్ని మ్యాచ్ లకు అతను దూరం అయితే సీఎస్కే టీమ్ కెప్టెన్‌ని, కీపర్‌ను వెతుక్కొవాలి. కెప్టెన్ గా బెన్‌ స్టోక్స్‌ రూపంలో ఆప్షన్ ఉంది. కీపర్‌గా అంబటి రాయుడు, డేవన్‌ కాన్వే, రుతురాజ్‌ గైక్వాడ్‌ అందుబాటులో ఉన్నారు. అయితే, శుక్రవారం గుజరాత్ టైటాన్స్ తో జరిగే తొలి మ్యాచ్ వరకు మహీ పూర్తి ఫిట్ నెస్ సాధించి జట్టును నడిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు.


More Telugu News