కర్ణాటకలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. 100 ఏళ్లు పైబడిన ఓటర్లు రాష్ట్రంలో ఎన్ని వేల మంది ఉన్నారో తెలుసా?

  • కర్ణాటకలో మొత్తం ఓటర్ల సంఖ్య 5.21 కోట్లు
  • 100 ఏళ్లు పైబడిన వారు 16,976 మంది
  • బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ
యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మే 10న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 

కర్ణాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 2.62 కోట్ల మంది కాగా, మహిళా ఓటర్లు 2.59 మంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో కొత్తగా ఒక వెసులుబాటును కల్పించారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు తమ ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేస్తున్న సమయంలో సీఈసీ రాజీవ్ కుమార్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో 100 ఏళ్లు పైబడిన ఓటర్లు 16,976 మంది ఉన్నారని ఆయన తెలిపారు. వందేళ్లు పైబడిన ఓటర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కర్ణాటకే కావడం గమనార్హం. 

మరోవైపు కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీకి 119 మంది, కాంగ్రెస్ కు 75, జేడీఎస్ కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చితీరాలనే పట్టుదలతో బీజేపీ ఉండగా... పూర్వవైభవాన్ని సాధించాలని కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల సర్వేల ప్రకారం బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ... కాంగ్రెస్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.


More Telugu News